మోసగించారు..న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

మోసగించారు..న్యాయం చేయండి

Published Tue, Mar 11 2025 12:10 AM | Last Updated on Tue, Mar 11 2025 12:10 AM

మోసగించారు..న్యాయం చేయండి

మోసగించారు..న్యాయం చేయండి

నెల్లూరు(క్రైమ్‌): ఐటీ లావాదేవీలు చూస్తానని, జాబ్‌ ఇప్పిస్తానని, బ్యాంక్‌ లోన్‌ ఇప్పిస్తానని, ప్లాట్ల పేరిట మోసాలకు పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన 73 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన ఆయా ప్రాంతాల పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో సత్వరమే సమస్యల్ని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, లీగల్‌ అడ్వైజర్‌ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల సెల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● నా భర్తకు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఉంది. కోవూరుకు చెందిన సురేష్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌నని పరిచయమయ్యాడు. కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూస్తానని నమ్మించాడు. ఐటీ చెల్లిస్తానని రూ.1.27 కోట్లు తీసుకున్నాడు. ఇటీవల ఐటీ కట్టలేదని నోటీసులొచ్చాయి. విచారించగా సురేష్‌ సీఏ కాదని తేలింది. అతడిని ప్రశ్నించగా దౌర్జన్యం చేస్తున్నాడని నెల్లూరు వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

● నెల్లూరుకు చెందిన డానియల్‌ ద్వారా ప్రమీల అనే మహిళ పరిచయమైంది. వారిద్దరూ తిరుపతి గోశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా జాబ్‌ రాకపోవడంతో నిలదీయగా నానా దుర్భాషలాడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని జువ్వలదిన్నెకు చెందిన వ్యక్తి కోరారు.

● నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన శశిధర్‌, ఈశ్వరయ్యలు నా వ్యాపారానికి తోడ్పాటునందించేందుకు బ్యాంక్‌లో లోన్‌ ఇప్పిస్తానని నమ్మించి వివిధ పత్రాలు తీసుకున్నారు. నాకు తెలియకుండా రూ.10 లక్షల లోన్‌ తీసుకుని వారు వాడుకున్నారు. నేను ప్రశ్నించగా దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని నవాబుపేటకు చెందిన ఓ మహిళ వినతిపత్రం ఇచ్చారు.

● బుచ్చికి చెందిన శ్రీధర్‌రెడ్డి, మోహన్‌లు నా స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని తీసుకెళ్లి నాకు తెలియకుండా అమ్మేశారు. వారిని అడిగితే బెదిరిస్తున్నారని బుచ్చికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

● వెంకటాచలం మండలం పాలిచర్లపాడులో లేఅవుట్‌లోని స్థలాలను నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు మాకు విక్రయించాడు. ఇటీవల ఆ స్థలాన్ని కొందరు చదును చేసి వ్యవసాయం చేసుకుంటుండగా మేం అడ్డుకున్నాం. శ్రీనివాసరావు స్థలం తాలూకా డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంతో సాగు చేసుకుంటున్నామని వారు చెప్పారు. రెవెన్యూ అధికారులను సంప్రదించగా వ్యవసాయేతర భూమిగా మార్చకుండా, నుడా అప్రూవల్‌ పొందకుండానే శ్రీనివాసరావు లేఅవుట్‌ వేసి ప్లాట్లు విక్రయించినట్లు తేలింది. తమను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.

● నా పెద్ద కుమారుడు బాగోగులు చూసుకుంటానని నమ్మించి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. కొంతకాలంగా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని సంతపేటకు చెందిన వృద్ధుడు ఫిర్యాదు చేశాడు.

నెల్లూరులో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

ఎస్పీకి వినతులు అందజేసిన బాధితులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement