మితిమీరిన టీడీపీ అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

మితిమీరిన టీడీపీ అరాచకాలు

Published Wed, Mar 12 2025 7:36 AM | Last Updated on Wed, Mar 12 2025 7:31 AM

మితిమీరిన టీడీపీ అరాచకాలు

మితిమీరిన టీడీపీ అరాచకాలు

నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు మితిమీరడమే కాదు.. హద్దు కూడా మీరాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ తోటపల్లిగూడూరు మండలం కోడూరు మజరా చెన్నపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సౌండ్‌ టెక్నీషియన్‌పై దాడి చేయడంతోపాటు వారి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశారన్నారు. పవిత్రమైన సరస్వతి విద్యాలయంలో టీడీపీకి చెందిన ఆవుల గణేష్‌, ముత్యాల హరి, పామంచి వాసు, మహేష్‌, చందు, విజయ్‌ మరో పది మంది మద్యం తాగి పాఠశాలల్లోకి వెళ్లి గందరగోళాన్ని సృష్టించారన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటే.. అసభ్యకరమైన పాటలు పెట్టి వాటికి డ్యాన్సులు వేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. అడ్డుకున్న పాఠశాల హెడ్‌మాస్టర్‌ను దుర్భాషలాడి, దాడి చేయడంతోపాటు సెల్‌ఫోన్‌ పగులగొట్టారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన సౌండ్‌ టెక్నీషియన్‌ ల్యాప్‌టాప్‌ను పగులగొట్టారన్నారు. ఇంత జరిగితే విద్యాశాఖ, పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాను డీఈఓను అడిగితే తనకేమి తెలియనట్లు చెప్పడం చూస్తే అధికార యంత్రాంగం పచ్చమూకలకు ఏ విధంగా సాగిలపడుతున్నారో అర్థమవుతుందన్నారు. తమ పార్టీ తరఫున అక్కడికి వెళ్లితే పాఠశాల ఉపాధ్యాయులను టీడీపీ నాయకులు ఇబ్బందులు పెడతారన్న ఉద్దేశంతో తాము వెళ్లలేదనన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇటువంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. కొత్త సంప్రదాయాలు, సంస్కృతికి తెరలేపి విచ్చలవిడి తనానికి కేరాఫ్‌గా సర్వేపల్లి తయారైందన్నారు. సంబంధిత అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తాము విడిచి పెట్టేది లేదన్నారు.

సోమిరెడ్డి.. నీది తప్పుడు బతుకు

సోమిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం చూస్తే ఆయన నిజాయితీతో కూడిన బతుకు బతుకుతున్నాడని తాను అనుకోవడం లేదని కాకాణి అన్నారు. ఆయనపైన అక్రమంగా 18 కేసులు పెట్టినట్టుగా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని, ఆ కేసుల వివరాలు చెప్పాలని కాకాణి డిమాండ్‌ చేశారు. రేయింబవుళ్లు ఆయన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లుగా కూడా సోమిరెడ్డి చెప్పాడని, ఈ విషయాల్లో ఒక్కటైనా రుజువు చేయాలని ఛాలెంజ్‌ విసిరారు. హిజ్రాలతోపాటు మరి కొంతమంది కలిసి దాదాపు 400 మంది తనపై దాడి చేయడానికి వచ్చారని సోమిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ వ్యక్తికి చెందిన 2.30 ఎకరాల స్థలాన్ని సోమిరెడ్డి దొంగతనంగా అమ్మేశాడని, దీనిపై సదరు యజమాని సోమిరెడ్డిపై కేసు పెట్టారన్నారు. తన ఆత్మహత్యకు సోమిరెడ్డి కారణమని రాసిన లేఖలను సైతం మాయం చేసినటు వంటి వ్యక్తివి నువ్వు.. నీది ఒక బతుకేనా అని కాకాణి ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి చెప్పిన విషయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయట పడుతాయన్నారు. అక్రమంగా గ్రావెల్‌, బూడిద, ఇసుక, మట్టి దోచుకునే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి సోమిరెడ్డి అని చెప్పారు. సర్వేపల్లిలో 6 ఎకరాలను వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తులు రూ.35 లక్షలకు విక్రయించడం జరిగిందని సోమిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో నిగ్గు తేల్చాలని కొందరు సోమిరెడ్డికి ఛాలెంజ్‌ విసిరారన్నారు. పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న విషయంపై నమోదైన కేసులో సోమిరెడ్డి కుమారుడు ఉన్నాడని, ఈ కేసుపై ఇప్పటికీ విచారణ జరగడం లేదన్నారు. ఈ కేసును తొక్కిపెట్టారని కాకాణి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ గురించి విమర్శించే అర్హత, కానీ, స్థాయి కానీ నీకు లేదన్న విషయాన్ని సోమిరెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు.

మద్యం తాగి వచ్చి పాఠశాలలో

రచ్చ రచ్చ

విద్యార్థులు, హెడ్‌మాస్టర్‌పై దాడి చేయడం దారుణం

వారిపై కేసులు నమోదు చేసి

కఠినంగా శిక్షించాలి

18 అక్రమ కేసులు పెట్టినట్లు అసెంబ్లీలో చెప్పిన సోమిరెడ్డి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement