డిజిటల్ అరెస్ట్ చేసి.. రూ.1.02 కోట్లు దోచేసి..
● సైబర్ నేరగాళ్ల నిర్వాకం
● రూ.23 లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు
● లబోదిబోమంటున్న విశ్రాంత ఉద్యోగి
నెల్లూరు(క్రైమ్): సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.02 కోట్ల నగదును దోచేశారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి గతనెల 25వ తేదీన ట్రాయ్ అఽధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీలో మీరు కొనుగోలు చేసిన సిమ్‌పై 85 ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదైందని చెప్పారు. మీ పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతాను మనీల్యాండరింగ్‌కు వినియోగించారని, జాతీయ భద్రతా చట్టాన్ని దుర్వినియోగం చేశారని చెప్పగా తనకు ఎలాంటి సంబంధం లేదని విశ్రాంత ఉద్యోగి తెలియజేశాడు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి ట్రాయ్ అధికారి ఫోన్ కాల్ కట్ చేశారు. తర్వాత సీబీఐ అధికారినంటూ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి మీపై కేసు నమోదైందని చెప్పాడు. అనంతరం మోహిత్ కందా అనే మరో వ్యక్తి ఫోన్ చేసి తానూ సీబీఐ అధికారినేనని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాకేష్‌కుమార్‌తో మాట్లాడి కేసు నుంచి తప్పిస్తానని చెప్పాడు. అందరూ కలిసి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1,02,47,680ల నగదును వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. అనంతరం వారు కేసు నుంచి తప్పించేందుకు వీలుకావడం లేదని బెయిల్ పొందేందుకు మరో రూ.3 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పడంతో విశ్రాంత ఉద్యోగికి అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. వేదాయపాళెం పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రూ.23 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి చర్చలకు ఆహ్వానం
నెల్లూరు(అర్బన్): ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఒ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కమిషన్ చేసిన సూచనల్ని ఆయన వివరించారు. అన్ని జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, సీనియర్ రాజకీయ ప్రతినిధులతో చర్చలు జరిపి వారి నుంచి సూచనలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎటువంటి పరిష్కారం లభించని సమస్యలపై ఏప్రిల్ 30వ తేదీ నాటికి రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘం సూచనలు కోరిందన్నారు. ఈ మేరకు వాటికి వ్యక్తిగతంగా లేఖలు పంపిందన్నారు. పార్టీల అధ్యక్షులు, పార్టీల సీనియర్ సభ్యులతో పరస్పర అనుకూల సమయానికి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment