
మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు
నెల్లూరు(క్రైమ్): ఆపరేషన్ గరుడకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో విజిలెన్స్, ఔషధ నియంత్రణ అధికారులు, స్థానిక పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు ఆత్మకూరు పట్టణంలోని రామలక్ష్మణ మెడికల్స్, ఎంఆర్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ, నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని సాయిరేఖ మెడికల్స్, శ్రీనివాస అగ్రహారంలోని అనంత సంజీవిని జనరిక్ మెడికల్ షాప్, ఆచారివీధిలోని గణేష్ మెడికల్స్, బోసుబొమ్మ సమీపంలోని రత్న మెడికల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్లోనాజెపామ్, అల్పాజోలం తదితర డ్రగ్స్‌కు సంబంధించిన క్రయ, విక్రయాలపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తంలో మాత్రలు కొనుగోలు చేశారు?, ఎవరికి విక్రయించారు?, వాటికి సంబంధించిన బిల్లులు, వైద్యుడి ప్రిస్క్రిప్షన్ల మేరకే విక్రయించారా? లేదా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాళాలు వేసి..
తనిఖీల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని కొందరు వ్యక్తులు తమ దుకాణాలకు తాళాలు వేసేశారు. ఈ సందర్భంగా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ వీరకుమార్ మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ల లేకుండా మత్తుమాత్రలను విక్రయించరాదన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌లు కె.నరసింహారావు, ఎ.శ్రీహరి, షేక్ సుభానీ, డీసీటీఓ విష్ణురావు, ఏఓ పి.వేణుగోపాల్‌రావు, ఏఈఈ బి.వెంకటరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఇన్‌స్పెక్టర్లు కీర్తి పవిత్ర, టి.వెంకటకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మత్తుమాత్రల క్రయ, విక్రయాలపై
పరిశీలన

మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు