
పుట్టెడు దుఖంలో ఉన్నా.. కనికరం లేకుండా
● ఇంట్లోంచి వృద్ధురాలి గెంటివేత
మనుబోలు: భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న వృద్ధురాలిపై జాలి, దయా లేకుండా సొంత మరిదే ఇంటి నుంచి గెంటేసి తాళమేసిన ఘటన మండలంలోని వడ్లపూడిలో చోటుచేసుకుంది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వడ్లపూడికి చెందిన వృద్ధ దంపతులు రావూరి రాఘవయ్య, రమణమ్మ దంపతుల ఏకై క కుమార్తె చనిపోయారు. దీంతో వీరి ఆలనాపాలనను నెల్లూరులో నివాసం ఉంటున్న ఆయన సోదరుడు చంద్రయ్య చూసేవారు. ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో రాఘవయ్య ఇటీవలే తన పొలాన్ని విక్రయించారు. వచ్చిన సొమ్ములో కొంత వెచ్చించి నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. మిగిలిన నగదును సోదరుడి వద్ద ఉంచారు. ఈ తరుణంలో ఈ నెల ఆరున రాఘవయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య ఏమి జరిగిందో గానీ రావూరి రమణమ్మను ఇంటి నుంచి చంద్రయ్య మూడు రోజుల క్రితం గెంటేసి తాళమేశారు. ఇప్పటికే కాలు విరిగి మంచం పట్టిన రమణమ్మ పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటి బయటే ఉంటూ ఇరుగుపొరుగు వారు పెట్టే అన్నం తింటూ కడుపు నింపుకొంటున్నారు. విషయం తెలుసుకున్న వెంకటాచలం మండలం కురిచెర్లపాడుకు చెందిన ఆమె సోదరుడు రామకృష్ణనాయుడు మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.