
మద్యం మత్తులో జనసేన నేత వీరంగం
ఉదయగిరి: మద్యం మత్తులో జనసేన నేత వీరంగం సృష్టించిన ఘటన కలిగిరిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పాతూరుకు చెందిన జనసేన మండల కన్వీనర్ బండారు లక్ష్మీనారాయణ మద్యం మత్తులో.. రోడ్డుపై ఉన్న జిర్రావారిపాళేనికి చెందిన తండ్రీకొడుకు మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, చంద్రారెడ్డిపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. కలిగిరిలోని ఒక చిల్లర దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్న శ్రీనివాసులురెడ్డికి సౌమ్యుడిగా మంచి పేరు ఉంది. దీంతో అతని స్వగ్రామంతో పాటు కలిగిరి నుంచి బంధుమిత్రులు, గ్రామస్తులు సుమారు 200 మందికిపైగా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. లక్ష్మీనారాయణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి రెండు గంటల వరకు నిరసన చేపట్టారు. దీంతో సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఉమాశంకర్ ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లక్ష్మీనారాయణ పలువురిపై దాడులకు తరచూ పాల్పడుతున్నారని ఆరోపించారు. అతనికి భయపడి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంలేదని చెప్పారు. కాగా లక్ష్మీనారాయణపై చట్టపరమైన చర్యలు చేపడతామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. జిర్రావారిపాళెం గ్రామస్తులతో పోలీస్‌స్టేషన్లో శనివారం మరోసారి చర్చించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తండ్రీకొడుకుపై అకారణంగా దాడి
రాస్తారోకో, ఆందోళన చేపట్టిన
గ్రామస్తులు

మద్యం మత్తులో జనసేన నేత వీరంగం