
అనంతపురం అర్బన్: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్పీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థి గెలవాలంటే పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసివేయగా.. చెల్లిన ఓట్లలో ప్రాధాన్యతా పద్ధతిలో 50 శాతంపైన ఒక ఓటు అధికంగా రావాలి. పట్టభద్ర ఎమ్మెల్సీకి 2,45,576, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 25,887 ఓట్లు పోలయ్యాయి.
● తొలుత మొదటి ప్రాధాన్యత (1) ఓట్లు ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. ఈ దశలో ఎవరైనా 50 శాతంపైన ఒక ఓటు ఎక్కువ సాధిస్తే ఆ అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2వ, 3వ, 4వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన అవసరమే ఉండదు.
● మొదటి ప్రాధాన్యత (1) ఓట్లు ఎవరికీ 50 శాతంపైన ఒక ఓటు రాకపోతే... మొదటి ప్రాధాన్యత ఓట్లు అందరికంటే తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ (తొలగింపు) చేస్తారు. అతని రెండవ (2) ఓటును మిగిలిన వారికి ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. ఈ క్రమంలో ఎవరైనా అభ్యర్థికి 50 శాతంపైన ఒక ఓటు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తారు. లేనిపక్షంలో లెక్కింపు కొనసాగిస్తారు.
● ఆ తరువాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తప్పించి అతని రెండవ (2) ఓట్లను మిగిలిని వారిలో ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. అప్పుడూ ఎవరికీ 50 శాతంపైన ఒక ఓటు రాకపోతే.... అప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరి మూడవ (3) ప్రాధాన్యత ఓట్లను లెక్కించి పై వారికి కలుపుతారు.
● చెల్లిన ఓట్లలో 50 శాతంపై ఒక ఓటు వచ్చే వరకు ఆఖరు నుంచి తక్కువ ఓట్లు వచ్చిన వారి 2వ, 3వ, 4వ ఓట్లను ఒక క్రమంలో కలుపుతూ పోతారు.
● చివరిదాకా 50 శాతంపై ఒక ఓటు రాకపోతే... ఎలిమినేట్ కాని చివరి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. జేఎన్‌టీయూ కళాశాల ఆవరణలోని స్ట్రాంగ్ రూంను ఆయన పరిశీలించారు. అనంతరం కౌంటింగు హాలులో ఏర్పాట్లపై ఆరా తీశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారుల వాహనాల ఎంట్రీతో పాటు పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగంతో కలసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అనంతపురం డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment