పెనుకొండ (సత్యసాయి జిల్లా): జిల్లా టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. బీకే పార్థసారథి అల్లుడు, కర్ణాటకకు చెందిన శశిభూషణ్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా మంది అగ్ర నాయకులు పార్టీకి దూరమయ్యారు. తాజాగా ఈ పరిస్థితి మరింత దిగజారింది.
ఓ పార్టీకి జిల్లా అధ్యక్షుడు అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వర్గపోరుకు ఆజ్యం పోస్తూ కింది స్థాయి కార్యకర్తలు ప్రత్యక్షంగా ఆయనపై నోరు పారేసుకునే దుస్థితి నెలకొంది. మరో వైపు ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న మడకశిర నియోజకవర్గంలో అగ్రవర్ణాల అధిపత్యాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకలాపాలకు దళితులు దూరమయ్యారు. ఇందుకు బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుక వేదికగా మారింది.
రెండ్రోజుల క్రితం పరిగిలో..
నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులకు చేరుకున్న నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్రలను బీకే పార్థసారథి చేపట్టారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం పరిగి మండలం బీర లింగేశ్వరాలయం నుంచి పైడేటి వరకూ సాగిన పాదయాత్రకు సవితమ్మ వర్గీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ విషయం గిట్టని బీకే... తన పక్కనే నడుస్తున్న సవితమ్మపై అసహనానికి గురయ్యారు.
విషయాన్ని గుర్తించిన సవితమ్మ ప్రధాన అనుచరుడు వెంటనే బీకేపై రెచ్చిపోయాడు. ప్రధాన నాయకుడిని ఉద్దేశించి ఓవరాక్షన్ చేస్తే దెబ్బలు తింటారని హెచ్చరించాడు. నీ చేత ఏమీ కాదంటూ సవాల్ విసిరాడు. భారీ ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తల మధ్య అలా మాట్లాడడంతో బీకే మౌనం వహించి, తలదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మడకశిర: నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర వేదికగా బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా స్థాయి నాయకులందరూ పాల్గొన్న ఈ వేడులకు అందరూ ఊహించినట్లుగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన వర్గీయులు దూరంగా ఉన్నారు.
దళితులను కాదని..
మడకశిర నియోజకవర్గంలో ఈరన్నకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా టీడీపీ అధిష్టానం ఆయనను నియమించింది. ఆ సమయంలో పార్టీ పటిష్టతకు ఆయన శ్రమించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈరన్నను తొలగిస్తూ పార్టీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి అప్పగించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఈరన్నకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రతి అంశంలోనూ ఈరన్న ఎదుగుదలను పూర్తి స్థాయిలో అణచివేశారు.
ఆత్మాభిమానాన్ని చంపుకోలేక
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ముద్రించిన కరపత్రాల్లో దళిత నాయకుల పేర్లు లేకపోవడంపై ఈరన్న, ఆయన వర్గీయులు అసహనానికి గురయ్యారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేని, దళిత నేతలను అవమానించేలా వారి పేర్లు లేకుండా కరపత్రాల ముద్రణ కాస్త వివాదాస్పదమైంది. దీంతో టీడీపీకి దళితుల అవసరం తీరిపోయిందని, గుండుమల గుత్తాధిపత్యం కింద తాము ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయలేమంటూ శతజయంతి వేడుకలకు దళిత నాయకులు మూకుమ్మడిగా దూరమైనట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఈరన్న లేని లోటు ఈ ఉత్సవాల్లో స్పష్టంగా కనబడింది.
సోషల్ మీడియా వేదికగా వర్గపోరు
బీకే, సవితమ్మ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. సామాజిక మాధ్యమాలు వేదికగా రోజూ ఒకరిపై ఒకరు పోస్టింగ్‌లు చేస్తుండడం చర్చానీయాంశమయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు వర్గాలు ప్రత్యక్ష దాడులకు తెగబడడం ఖాయమని ఆ పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment