రెడ్డప్పశెట్టికి బిగుస్తున్న ఉచ్చు
● ఆక్రమణలపై కదిలిన
రెవెన్యూ యంత్రాంగం
● స్థానిక అధికారులను వివరణ కోరిన
కలెక్టర్ చేతన్..!
చిలమత్తూరు: చిత్రావతి నదిని చెరట్టి ఏకంగా అక్రమంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన రియల్టర్ రెడ్డప్పశెట్టికి ఉచ్చుబిగుసుకుంటోంది. కోడూరు, కొడికొండ గ్రామాల్లో రెడ్డెప్పశెట్టి ఆక్రమణలు, చిత్రావతి నదిపై అనధికార బ్రిడ్జి నిర్మాణం, రైతులపై వేధింపులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం కదిలింది. క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతూ నివేదిక చేస్తోంది. ఒకరిద్దరు అధికారులు రెడ్డెప్పశెట్టి ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి సహకరిస్తున్నా... ఉన్నతస్థాయి అధికారుల కన్ను ఉండటంతో ప్రతిదీ పరిశీలించి మరీ నివేదిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రెడ్డెప్పశెట్టి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ చేతన్ ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం అక్రమమని, వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు కంచె వ్యవహారంలో ప్లానింగ్ రోడ్డు మూసివేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. వీటిపై వివరణ ఇవ్వాలని బెంగళూరులో ఉన్న రెడ్డెప్పశెట్టికి నోటీసును పోస్ట్ ద్వారా పంపినట్లు అధికారులు తెలిపారు.
రైతులతో తప్పుడు స్టేట్‌మెంట్
ఓ రెవెన్యూ అధికారి తప్పుడు స్టేట్‌మెంట్ తయారు చేసి రైతులతో సంతకాలు చేయిందేందుకు ఎత్తుగడ వేయడం సంచలనం కలిగిస్తోంది. సోమవారం విచారణకు వెళ్లిన రెవెన్యూ అధికారుల్లో ఒకరు...రైతులు చెప్పని విషయాలు నివేదికలో పొందుపర్చేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం రైతులను బలవంతంగా తన కార్యాలయానికి పిలిపించి ఒత్తిడి చేసినా...వాళ్లు ససేమిరా అనడంతో ఆయన ప్లాన్ బెడిసి కొట్టింది.
తహసీల్దార్ ఓవర్ యాక్షన్..
రెడ్డెప్పశెట్టి వ్యవహారంలో ‘సాక్షి’లో వచ్చిన కథనాల ఆధారంగా సాగుతున్న విచారణ గురించి తహసీల్దార్ వెంకటేష్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా... ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఏదైనా డీటీ లేదా సీనియర్ అసిస్టెంట్‌ను అడగాలని, తాను బిజీగా ఉన్నానంటూ ఫోన్ కట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందుబాటులో ఉండని ఆయన్ను ఎవరైనా ప్రశ్నిస్తే తాను మూడు మండలాలు చూసుకుంటున్నానని, చిలమత్తూరులో ఉంటే కుదరదంటూ దురుసుగా సమాధానం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెడ్డప్పశెట్టికి బిగుస్తున్న ఉచ్చు
Comments
Please login to add a commentAdd a comment