కాళేశ్వర్ ఆశయ సాధనకు కృషి
పెనుకొండ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శివసాయి మందిరం వ్యవస్థాపకుడు, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ అధినేత సాయి కాలేశ్వర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ట్రస్ట్ నిర్వాహకురాలు శిల్ప తెలిపారు. శనివారం పెనుకొండలోని శివసాయి మందిరంలో సాయి కాళేశ్వర్ 13వ వర్ధంతి నిర్వహించారు. ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శిల్ప నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకురాలు శిల్ప సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పోలీసు శాఖకు రూ.28 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. సయికాళేశ్వర్ బాటలోనే గతంలో మాదిరిగా విద్య, వైద్యం, తాగునీరు తదితర సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం కంటి ఆపరేషన్లు చేయించుకున్న వృద్ధులకు, రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెనుకొండలో నేరాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు అవసరమని ట్రస్ట్ నిర్వాహకురాలి దృష్టికి తీసుకురాగా.. ఆమె వెంటనే స్పందించి ఆర్థికసాయం అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది గురుప్రసాద్, మదన్‌మోహన్‌రెడ్డి, ప్రగతి శ్రీనివాసులు, జాన్‌ప్రియనాథ్, నాగిరెడ్డి, చిట్టిబాబు, హరి, బాబు ఇతర ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.
కాళేశ్వర్ ఆశయ సాధనకు కృషి