రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం

Published Mon, Mar 17 2025 10:47 AM | Last Updated on Mon, Mar 17 2025 10:40 AM

ముదిగుబ్బ: మహాకుంభ మేళా సమయంలో రద్దయిన ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ప్యాసింజర్‌ రైళ్ల కోసం ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా గుంతకల్లు– తిరుపతి– గుంతకల్లు (రైలు నంబర్‌ 57403–57404), తిరుపతి –కదిరిదేవరపల్లి– తిరుపతి (57405–57406), తిరుపతి–హుబ్లీ– తిరుపతి (57401–57402) ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. మహాకుంభ మేళా సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను రెండు నెలలపాటు రద్దు చేసి.. ప్రయాగరాజ్‌ వైపు మళ్లించారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ తేదీకి రైళ్లు నడపలేదు. ఏడో తేదీ నుంచి నడుస్తాయని చెప్పారు. అదీ వాయిదా పడింది. ప్యాసింజర్‌ రైళ్లు తిరిగి పట్టాలు ఎప్పుడు ఎక్కుతాయా అని ముదిగుబ్బ స్టేషన్‌ నుంచి ప్రయాణించే ఉద్యోగులు, సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణించే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రైలు టికెట్‌ ధర అతి తక్కువగా ఉంది. తిరుమలకు రోజూ ముదిగుబ్బ నుంచి వందలాది మంది భక్తులు వెళ్లే వారు. అనారోగ్యంతో ఉన్న వారు తిరుపతిలోని పలు ఆస్పత్రులకు చికిత్సల కోసం వెళ్తుంటారు. అంతే కాకుండా అనంతపురం, ధర్మవరం నుంచి వచ్చే ఉద్యోగులకు కూడా ఈ ప్యాసింజర్‌ రైళ్లు అనుకూలంగా ఉండేవి. టికెట్‌ ధర తక్కువగా ఉండడంతో బస్సుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు కాదు. ముదిగుబ్బ నుంచి తిరుపతికి వెళ్లాలంటే ప్యాసింజర్‌ రైళ్లలో టికెట్‌ ధర రూ.50 మాత్రమే. అదే బస్సులో ప్రయాణిస్తే రూ.300కు పైగా వెచ్చించాల్సి ఉంటుంది. బస్సులో అయితే ప్రయాణం కూడా సౌకర్యంగా ఉండదు. మధ్య తరగతి ప్రజల కోసం ప్యాసింజర్‌ రైలులో రెండు స్లీపర్‌ బోగీలు ఉంటాయి. హుబ్లీ తిరుపతి ప్యాసింజర్‌ రైలులో ఒక స్లీపర్‌ బోగీ ఉంది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు చాలామంది వీటిలో రెండు నెలల ముందే బుక్‌ చేసుకొని వారు ప్రయాణాలు కొనసాగించేవారు. రెండు నెలలు దాటినా రద్దయిన ప్యాసింజర్‌ రైళ్లు తిరిగి నడపపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.

ముదిగుబ్బ నుంచి తిరుపతికి ప్యాసింజర్‌లో వెళ్లే రైలు టిక్కెట్‌ ధరలు ఈ విధంగా వున్నాయి. జనరల్‌ టికెట్‌ ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.50 అదే విధంగా స్లీపర్‌ టికెట్‌ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.120. గతంలో ఇదే రిజర్వేషన్‌ టికెట్‌ రూ.330 ఉండేది. అలాగే సిట్టింగ్‌ టికెట్‌ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.65. ఇదే టికెట్‌ ధర గతంలో రూ.120 ఉండేది.

ముదిగుబ్బలో నిలిచిన ప్యాసింజర్‌ రైలు (ఫైల్‌)

మహాకుంభమేళా సమయంలో ఆరు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

పునరుద్ధరణపై రైల్వే శాఖఅధికారుల తాత్సారం

ప్రయాణికులకు తప్పని అవస్థలు

భారీగా తగ్గిన రైలు చార్జీలు

30 నుంచి రైళ్ల పునరుద్ధరణ

ప్రజల సౌకర్యార్థం రైల్వే శాఖ వారు ప్యాసింజర్‌ రైలు టికెట్‌ ధరలు భారీగా తగ్గించారు. మార్చి 30 నుంచి రద్దయిన ప్యాసింజర్‌ రైళ్లు తిరుగుతాయి. ముదిగుబ్బ నుంచి తిరుపతికి గతంలో రూ.330 ఉన్న స్లీపర్‌ టికెట్‌ ధర ప్రస్తుతం రూ.120కి తగ్గించారు. సిట్టింగ్‌ టికెట్‌ ధర గతంలో రూ.120 ఉండగా ఇప్పుడది రూ.65కు తగ్గింది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.

నాగభూషణం

రైల్వే స్టేషన్‌ మాస్టర్‌, ముదిగుబ్బ

తక్కువ టికెట్‌ ధరతోనే సురక్షితంగా గమ్యస్థానం చేర్చే ప్యాసింజర్‌ రైళ్లు పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు తిరుపతి వరకు వెళ్లాలన్నా ఈ ప్యాసింజర్‌ రైళ్లు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. అలాంటి రైళ్లను మహాకుంభమేళా కోసం మళ్లించారు. మహాకుంభ మేళా ముగిసి మూడు వారాలవుతున్నా ఇంతవరకూ ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

రైళ్ల రద్దు కారణంగా తిరుమలకు వెళ్లాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. బస్సులో వెళ్లాలంటే చార్జీలు ఎక్కువ. అదే రైలు టికెట్‌ ధర చాలా తక్కువగా ఉంది. మాలాంటి మధ్యతరగతి ప్రజల కోసం రైళ్లు పునరుద్ధరించాలని కోరుతున్నాం.

– వెంకటరెడ్డి, ముదిగుబ్బ

తక్కువ ధరకే సౌకర్యమైన ప్రయాణం

రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం 1
1/3

రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం

రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం 2
2/3

రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం

రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం 3
3/3

రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement