రెండో రోజూ శ్రీవారిని తాకిన సూర్యకిరణాలు
ధర్మవరం అర్బన్: స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలోని చెన్నకేశవస్వామి మూలవిరాట్‌ను సోమవారం ఉదయం రెండో రోజు కూడా సూర్యకిరణాలు తాకాయి. సూర్య పూజా మహోత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. మూడు రోజుల పాటు స్వామిని సూర్యకిరణాలు తాకుతాయని ఏటా ఇలా జరుగుతుందని అర్చకులు తెలిపారు.
రెడ్డెప్పశెట్టి ఎస్టేట్‌లో
వలస కూలీ మృతి
చిలమత్తూరు: మండలంలోని కొడికొండ సమీపంలో రియల్టర్ రెడ్డెప్పశెట్టికి చెందిన ఎస్టేట్‌లో పనిచేస్తున్న వలస కూలీ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన అర్జున్ (21) విష ద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికెళ్లి పరిశీలించామన్నారు. విషం ఎందుకు తాగాడనేది తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ విషయం బయట పడకుండా ఎస్టేట్ యాజమాన్యం తొక్కి పెట్టి గుట్టు చప్పుడు కాకుండా అర్జున్ మృతదేహాన్ని ఖననం చేయడం అనుమానాలకు తావిస్తోంది. కొడికొండ చెరువులో మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడంతో తిరిగి ఎస్టేట్ పరిసరాల్లోనే పాతిపెట్టారు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడమే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చర్చించుకుంటున్నారు.
ప్రమాదంలో యువకుడి మృతి
బెళుగుప్ప: మండలంలోని బి.రామసాగరం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్పకు చెందిన బోయ చంద్రన్న కుమారుడు సతీష్‌కుమార్ (19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవల ఇంటికి వచ్చాడు. తనతో పాటు అదే కళాశాలలో చదువుకున్న స్నేహితుడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌తో కలసి సోమవారం ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఎర్రితాత రథోత్సవానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు బి.రామసాగరం క్రాస్ వద్దకుచేరుకోగానే అదుపు తప్పి కిందపడ్డారు. చీకటిలో అటుగా వచ్చిన కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు విషయం తెలిసి, 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సతీష్‌కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్‌కు చికిత్సలు అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.