
నాటి ఖాద్రి.. నేటి కదిరి
కదిరి: పూర్వం ఖాద్రిగా పిలుచుకునే ప్రాంతమే నేడు కదిరిగా మారింది. సంస్కృతంలో ‘ఖా’ అంటే విష్ణు పాదం అని అర్థం. అద్రి అంటే కొండ. ఈ రెండింటినీ కలిపి ఖాద్రి (విష్ణువు పాదం మోపిన కొండ)గా అప్పట్లో పిలిచేవారు. కాలక్రమేణా... ఖాద్రి కాస్త కదిరిగా మారిపోయింది. దేశంలోని అత్యధికంగా ప్రతిష్టిత ఆలయాలు ఉండగా.. మరికొన్ని స్వయంభువుగా వెలసినవి ఉన్నాయి. ఇందులో ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఆలయ చరిత్రను పరిశీలిస్తే.. పూర్వం హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం ఖాద్రీ ప్రాంతంలో సంచరిస్తున్న నారసింహుడి ఉగ్రరూపాన్ని శాంతింప చేయడానికి దేవతల అభ్యర్థన మేరకు ప్రహ్లాదుడు స్తుతిస్తాడు. దీంతో సంతుష్టుడైన నారసింహుడు ప్రహ్లాదుడిని దగ్గరకు తీసుకుని ఆశీర్వదిస్తాడు. ఈ ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా కదిరి ఆలయంలో ప్రహ్లాద సమేతంగా నారసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రీ.శ. 10వ శతాబ్ధంలో పట్నం పాలేగారు రంగనాయకులుకు స్వామి స్వప్నంలో కనిపించి ఆదేశించిన మేరకు ఖాద్రి వృక్షం కింద తవ్వకాలు చేపడతాడు. ఆ సమయంలో బయటపడిన ప్రహ్లాద సమేత నారసింహుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. నాలుగు దివ్యమైన గోపుర శిఖరాల నడుమ వెలసిన ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటే సాక్షాతూ ఆ బదరీనారాయణుడిని దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. తూర్పు రాజగోపురాన్ని హరిహర రాయలు, పడమర గోపురాన్ని క్రీ.శ 1469లో స్వామి భక్తురాలు సాసవుల చిన్నమ్మ, దక్షిణ గోపురాన్ని క్రీ. శ 1386లో కొక్కంటి పాలేగారు వీరమల్లప్ప నాయుడు కుటుంబీకులు, ఉత్తర రాజ గోపురాన్ని ముస్లిం పాలకులు నిర్మించినట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని రోజూ కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ఇక్కడి దవణానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు తమవెంట కదిరి మల్లెలు, కుంకుమ, దవణం విధిగా తీసుకెళ్తారు.

నాటి ఖాద్రి.. నేటి కదిరి

నాటి ఖాద్రి.. నేటి కదిరి
Comments
Please login to add a commentAdd a comment