‘మార్కెటింగ్’ టార్గెట్ రూ.19.79 కోట్లు
● ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీలకు లక్ష్యం నిర్దేశించిన ఆర్జేడీ
అనంతపురం అగ్రికల్చర్: ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి అనంతపురం జిల్లా మార్కెట్ కమిటీలకు రూ.19.79 కోట్ల పన్ను వసూళ్లను లక్ష్యంగా మార్కెటింగ్‌శాఖ నిర్ధేశించింది. మంగళవారం అనంతపురంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజినేయులు సమక్షంలో రెండు జిల్లాల ఏడీఎంలు పి.సత్యనారాయణచౌదరి, ఎల్‌ఎన్ మూర్తి, 17 మార్కెట్ కమిటీల సెక్రటరీలు, సూపర్‌వైజర్లు సమావేశమయ్యారు. 2024–25లో నిర్దేశించిన టార్గెట్లు, సాధించిన ప్రగతిపై సమీక్షిస్తూనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు, బడ్జెట్ తదితర అంశాలపై మార్కెట్ కమిటీల వారీగా చర్చించారు. అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 9 మార్కెట్ కమిటీకు రూ.13.93 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న 8 మార్కెట్ కమిటీలకు రూ.5.86 కోట్లు టార్గెట్ నిర్ధేశించారు. ప్రస్తుత 2024–25లో రూ.5.31 కోట్లకు గానూ వంద శాతం సాధించే దిశగా మార్కెట్ కమిటీలు పయనిస్తున్నట్లు తెలిపారు. దీంతో రెండు జిల్లాలకు అదనపు టార్గెట్లను కలిసి రూ.19.79 కోట్లు నిర్ధేశిస్తున్నట్లు ఆర్జేడీ తెలిపారు. ఎక్కడా లీకేజీలు లేకుండా వంద శాతం ఫీజు వసూళ్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే వంద శాతం పూర్తయిన మార్కెట్ కమిటీ సెక్రటరీలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment