తహసీల్దార్లు స్థానికంగానే నివాసం ఉండాలి
ప్రశాంతి నిలయం: తహసీల్దార్లు మండల కేంద్రంలోనే నివాసం ఉంటూ ఎప్పటిపనులు అప్పుడే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. రీసర్వేలో ప్రగతి సాధించేందుకు తహసీల్దార్లు, సర్వేయర్లు బాధ్యతతో పనిచేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో రీసర్వే, పీజీఆర్‌ఎస్ తోపాటు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటి స్థలం సర్టిఫికెట్ మ్యానువల్‌గా ఇవ్వకూడదన్నారు. రీసర్వే సక్రమంగా జరిగితే భూ సమస్యలు తగ్గుతాయన్నారు. నిబంధనల మేరకు రీ సర్వే నిర్వహించాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. భూముల హద్దులు నిర్ణయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐవీఆర్‌ఎస్ రిపోర్టులో అమరాపురం, ఆగళి, చిలమత్తూరు, రొద్దం, రొళ్ల, సోమందేపల్లి సర్వేయర్లపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో విచారించి నివేదికలు అందజేయాలన్నారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 25 గ్రామాలను పైలెట్‌గా ఎంపిక చేశామని, ఆయా గ్రామాల్లో మార్చి 20 నుంచి రీ సర్వే నిర్వహిస్తామన్నారు. ముందుగా ప్రతి రైతుకు, పట్టాదారునికి నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు, సర్వే అండ్ ల్యాండ్ అధికారి, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment