ఐచ్ఛికంతో ‘తెలుగు’ ప్రశ్నార్థకం
పుట్టపర్తి టౌన్: ఇంటర్మీడియెట్‌లో తెలుగును ఐచ్ఛికం (ఆప్షనల్) చేస్తే తెలుగుభాష ఉనికి ప్రశ్నార్థకమవుతుందని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ మూల్యాంకనం కోసం వచ్చిన అధ్యాపకులు బుధవారం కొత్త చెరువు జూనియర్ కళాశాల ఎదుట ఽనిరసనకు దిగారు. అనంతరం జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘునాథరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్‌లో ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు నూరుల్లా, శంకరప్ప, పెద్దన్న, బయపరెడ్డి, నాగరత్నమ్మ, లలిత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు
27న ఎన్నికలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తమకు ఉత్తర్వులు వచ్చాయని వివరించారు. ఖాళీ అయిన రొద్దం, రామగిరి, గాండ్లపెంట, కంబదూరు, కణేకల్లు ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉరవకొండ, యల్లనూరు, పెద్దపప్పూరు, రాయదుర్గం వైస్ ఎంపీపీ స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ప్రకటించారు. పైన పేర్కొన్న స్థానాల్లో కొందరు చనిపోగా, మరికొందరు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు.