
హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన
చెన్నేకొత్తపల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నేకొత్తపల్లిలో ఆదివారం నిర్వహించిన వృషభాల బల ప్రదర్శన హోరాహోరీగా సాగింది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన పోటీలకు పలు గ్రామాలకు చెందిన రైతులు తమ వృషభాలను తీసుకువచ్చారు. తోపుదుర్తికి చెందిన రైతు చెన్నప్ప వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో గార్లదిన్నెకు చెందిన రైతు నరేష్ వృషభాలు, మూడో స్థానంలో బళ్లారికి చెందిన రైతు ఆనందరెడ్డి వృషభాలు, నాల్గో స్థానంలో సోములదొడ్డికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు, ఐదో స్థానాన్ని హుస్సేనాపురం రైతు వెంకటసుబ్బారెడ్డి వృషభాలు దక్కించుకున్నాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు.
గ్రామాల్లో ఉత్సాహంగా ఉగాది సేద్యం
గుత్తి రూరల్: మండలంలోని గొందిపల్లి, తురకపల్లి, కరిడికొండ, తొండపాడు, అబ్బేదొడ్డి, బేతాపల్లి, కొత్తపేట, వన్నేదొడ్డి, మాముడూరు, అనగానదొడ్డి, బసినేపల్లి, లచ్చానపల్లితో పాటు ఇతర గ్రామాల్లో రైతులు ఉగాది సేద్యం చేశారు. ఉగాది రోజు గుంటకతో పొలం దున్ని సంప్రదాయ, ఆచారాలను పాటిస్తూ కల్మషం లేని చిన్నారులతో సేద్యం పనులను ప్రారంభిస్తే పంటలు బాగా పండుతాయని నమ్మకం. దీంతో ఆదివారం వేకువజామునే పిల్లలకు నూతన వస్త్రాలను ధరింపజేసి పొలాలకు తీసుకెళ్లారు. గొర్రు, నాగలికి పసుపు కుంకుమ పూసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి చిన్నారుల చేతుల మీదుగా సేద్యం పనులను ప్రారంభించారు. అనంతరం పొలాల్లో రైతులు గుంటక పాశారు. ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు తిప్పారు.

హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన