క్రికెట్ బెట్టింగ్ జోరు
బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై చర్యలు
క్రికెట్ బెట్టింగ్‌ల పేరుతో యువతను ఊబిలోకి దించి ఆన్‌లైన్‌లో, ప్రత్యేక యాప్‌ల ద్వారా నేరుగా ఆడించి కమీషన్లు పొందే వారిపై కఠిన చర్యలు తప్పవు. యువత కూడా క్రికెట్ మోజులో పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలి.
– కె.వి.మహేష్, డీఎస్పీ, హిందూపురం
హిందూపురం అర్బన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ –2025 (ఐపీఎల్) 18వ సీజన్ మొదలైంది. ఉత్కంఠగా సాగే ఈ క్రికెట్ మ్యాచ్‌లను అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగారు. ‘మీ ఫేవరెట్ టీమ్ గెలుస్తుందా.. నిజంగా టీమ్‌పై అభిమానం ఉంటే బెట్టింగ్ కట్టవచ్చు కదా.. సరదాకు సరదా.. డబ్బులూ గెలుచుకోవచ్చు.. అంటూ చిన్నగా ముగ్గులోకి దించుతున్నారు. బెంగళూరు కేంద్రంగా హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర పట్టణాలే కాకుండా మండల కేంద్రాలకు .. గ్రామాలకు బెట్టింగ్ వ్యవహారం విస్తరిస్తోంది. ఇదేమీ గుట్టుగా కాదు ఆన్‌లైన్ ద్వారా బహిరంగంగానే సాగిస్తున్నారు. బెట్టింగ్ అంతా సెల్ ఫోన్‌లోనే సాగుతోంది. ఇరువురు ఫోన్‌లలోనే కాంటాక్ట్ చేసి బెట్టింగులు కాయిస్తున్నారు. గెలిచిన వారి నుంచి కమీషన్ పొందేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. పట్టణాలు, పల్లెల్లోని యువకులను టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఎంతోమంది యువకులు బెట్టింగ్‌లో ఓడి అప్పుల పాలైన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. కొందరు పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకొన్న విషయమూ విదితమే.
ప్రతి బంతికీ ఓ రేటు..
టాస్ వేసే సమయం నుంచి బ్యాటింగ్ ఎవరు ఎంచుకొంటారు.. బౌలింగ్ ఎవరు చేస్తారు.. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు తీస్తాడు.. ఓవర్‌కు ఎన్ని పరుగులు వస్తాయి.. ఎవరు గెలుస్తారు.. ఎన్ని పరుగులతో మ్యాచ్ పూర్తి కానుంది .. ఇలా ప్రతి దానికీ ఒక పందెం ఉంటుంది.
ప్రత్యేక యాప్‌ల ద్వారా..
ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు కొన్ని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పందేలు కాయడం.. మ్యాచ్ చూసేందుకు ఒకటి.. బెట్టింగ్ కాసేందుకు మరో మొబైల్ వినియోగించి ఆన్‌లైన్‌లో క్రికెట్ బుకీలు సంప్రదింపులు జరుపుతూ కమీషన్ పొందుతున్నారు.
ఇక స్థానికంగానూ..
హిందూపురం, ధర్మవరం, కదిరి లాంటి పెద్ద పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ యువత పోగై తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకొని అక్కడికి చేరుకొని నేరుగా బెట్టింగ్‌లకు దిగుతున్నారు. గతంలో ఎవరెవరు బెట్టింగ్‌లకు పాల్పడింది గుర్తించిన కొంత మంది పోలీసులు సైతం సొమ్ము చేసుకొంటున్నారు.
అప్పుడే మొదలైన జోరు..
పట్టణాలు, గ్రామాల్లో అప్పుడే యువత బెట్టింగ్‌ల జోరు కనిపిస్తోంది. ప్రధానంగా ఏయే తేదీల్లో ఎవరెవరి మధ్య మ్యాచ్ జరగనుందో తెలుస్తుండటంతో చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ , ముంబై టీమ్‌లపై బెట్టింగ్‌లు కాయనుండగా.. వీరిని కొందరు బుకీలు తమ వైపు తిప్పుకొని డబ్బు కాజేస్తున్నారు.
కోడ్ లాంగ్వేజ్‌లతో..
బెట్టింగ్ వ్యవహరం అంతా కోడ్ లాంగ్వేజీలోనే సాగేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. సెల్ ఫోన్‌లోనే ఎస్.. నో.. ఓకే.. డన్.. ఈటింగ్ వంటి పదాలు దీనికోసం వాడనున్నారు. చాలామంది సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోయి పందేలు కాసేందుకు ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేసుకొన్నారు. ఇందుకు హిందూపురం పట్టణంలో బెంగళూరు రోడ్డు, మోడల్ కాలనీ, ముద్దిరెడ్డిపల్లి. దండు రోడ్డు, చిలమత్తూరు, లేపాక్షి మండల కేంద్రాల్లో కొంతమంది యువత తమకు అనువైన ప్రదేశాలకు మ్యాచ్ టైమ్‌లో చేరుతున్నారు. టీవీలు చూస్తూ పందేలు కాస్తున్నారు. గ్రౌండ్‌లో చూసే ఆటకు.. టీవీల్లో చూసే వారికి రెండు నుంచి మూడు బంతుల సమయం తేడా ఉంటుంది. ఆట ముందే తెలుసుకొని బెట్టింగులు కాసే వారి జేబులను బుకీలు గుల్ల చేస్తున్నారు. ఇది యువత గమనించాలి. మ్యాచ్‌లో ఎవరు గెలవనున్నారు.. ఎవరు ఓడి పోతారు.. ఎవరెన్ని పరుగులు చేస్తారు.. ఈ ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయనే కోణంలోనూ పందేలు కాయడం మొదలైంది.
మొదలైన ఐపీఎల్ మ్యాచ్‌ల సందడి
అభిమానుల అమితాసక్తిపై బుకీల వల
బెట్టింగ్‌లోకి దింపి.. గుల్ల చేస్తున్న వైనం
క్రికెట్ బెట్టింగ్ జోరు
Comments
Please login to add a commentAdd a comment