
అధికారుల నిర్లక్ష్యం.. దివ్యాంగులకు శాపం
తాడిపత్రి రూరల్: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. దీంతో సదరం క్యాంప్‌లో వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో స్లాట్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి తేదీ, సదరం క్యాంప్ నిర్వహించే ఆస్పత్రి ఖరారు చేసి సమాచారాన్ని అందజేస్తారు. ఈ విధానం దివ్యాంగులకు ఎంతో సౌలభ్యంగా మారింది. అయితే ఇటీవల ఆర్థో, కంటి పరీక్షలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకున్న వారికి తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిని కేటాయిస్తూ మంగళవారం సదరం క్యాంప్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి వందలాది మంది దివ్యాంగులు వారి సహాయకులతో కలసి వచ్చారు. అయితే వైద్య పరీక్షలు చేసేందుకు ఎలాంటి పరికరాలు లేవని తెలియడంతో దివ్యాంగులు అయోమయంలో పడ్డారు.
పరికరాల్లేవు.. పరీక్షలు చేయలేం
ఆర్థో, కంటి వైద్య పరీక్షలు చేసేందుకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలాంటి వైద్య పరికరాలు లేవు. అర్థోకు అరకొరగా పరికరాలు ఉన్నా కంటి పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరమూ లేదు. తమకందిన సమాచారంతో మంగళవారం ఉదయం 8 గంటలకే వందలాది మంది దివ్యాంగులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 11గంటలైన పరీక్షలు మొదలు పెట్టకపోవడంతో విసుగెత్తి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్‌ను నిలదీశారు. దీంతో కంటి డాక్టర్ వసంత, ఆర్థో వైద్యుడు హరిప్రసాద్‌ను డాక్టర్ డేవిడ్ పిలిపించుకుని మాట్లాడారు. సదరం క్యాంప్‌కు హాజరైన దివ్యాంగులకు అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలు లేవని వారు చేతులేత్తేయడంతో విషయాన్ని వెంటనే డీసీహెచ్ డాక్టర్ పాల్ రవికుమార్ దృష్టికి సూపరింటెండెంట్ తీసుకెళ్లారు. బయటి నుంచి పరికరాలు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఆయన సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశారు. వెంటనే మరోసారి డీసీహెచ్‌కు డాక్టర్ డేవిడ్ ఫోన్ చేయడంతో ఆయన మంత్రి సత్యకుమార్ పర్యటనలో ఉన్నారంటూ కింది స్థాయి ఉద్యోగి తెలిపి ఫోన్ పెట్టేశారు. ఈ విసయం తెలియగానే దివ్యాంగులు మండిపడుతూ సూపరింటెండెంట్‌తో వాగ్వాదానికి దిగారు. రాప్తాడుకు చెందిన దివ్యాంగుడు విషయాన్ని వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనకే నేరుగా ఫోన్ చేశారు. అయితే మంత్రి మీటింగ్‌లో ఉన్నారని పీఏ హర్ష తెలిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. చివరకు పరికరాలే లేనప్పుడు వైద్య పరీక్షలు చేయడం సాధ్యం కాదంటూ చేతులెత్తేయడంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరీక్షల కోసం పిల్లాపాపలు, వృద్దులతో కలసి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు.
వైద్య పరీక్ష పరికరాలు లేకున్నా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి సదరం స్లాట్ ఖరారు
జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి తరలివచ్చిన దివ్యాంగులు