
కొడిగెనహళ్లిలో భారీ చోరీ
● ఇంట్లో ఎవరూ లేని సమయంలో
ప్రవేశించిన దుండగులు
● 30 తులాల బంగారం అపహరణ
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో భారీ చోరీ జరిగింది. వివరాలు.. కొడిగెనహళ్లి విద్యానగర్‌లో నివాసముంటున్న శంకరప్ప గత శనివారం ఇంటికి తాళం వేసి తన కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లాడు. తాళం వేసిన ఇంటిని గమనించిన దుండగులు మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి చొరబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్న శంకరప్ప.. తలుపులు తీసి ఉండడం గమనించి నివ్వెరపోయాడు. వాకిళ్లను ధ్వంసం చేసి, లోపల ఉన్న బీరువాల్లోని 30 తులాల బంగారంతో పాటు రూ.40 వేల నగదును అపహరించుకెళ్లినట్లుగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ నర్సింగప్ప, ఎస్‌ఐ రంగడు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. శంకరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏరియా ఆస్పత్రి వైద్యుల
అవినీతిపై విచారణ
కదిరి అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు గైనకాలజిస్టుల అవినీతిపై బుధవారం ప్రత్యేక వైద్యాధికారుల బృందం విచారణ చేపట్టింది. బృందంలో కర్నూలుకు చెందిన డాక్టర్ మాధవీలత, విజయవాడ డీసీహెచ్ వెంకట్రామయ్య, నంద్యాల ఏఓ శైలాజాదేవి ఉన్నారు. ఫిర్యాదుదారుడిని పిలిపించి గత నెల 7న వారికి జరిగిన అన్యాయంపై రాతపూర్వక విశ్లేషణను తీసుకున్నారు. అలాగే బాధితునితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డాక్టర్లను వేర్వేరుగా విచారించారు. విచారణ నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. కాగా, గైనకాలజిస్టుల అవినీతిపై విచారణ జరుగుతున్న సమయంలోనే స్థానిక సీపీఎం నేతలు అక్కడకు చేరుకుని ఆస్పత్రిలో స్కానింగ్ యంత్రాలున్నా.. కమీషన్ల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు రెఫర్ చేస్తున్న గైనకాలజిస్టులపై చర్యలు తీసుకోవాలంటూ విచారణ బృందానికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సీపీఎం పట్టణాధ్యక్షుడు జీఎం నరసింహులు, నాయకులు ముస్తాక్, రామ్మెహన్ ఉన్నారు.

కొడిగెనహళ్లిలో భారీ చోరీ