
సీహెచ్‌ఓల డిమాండ్లు నెరవేర్చాలి
పుట్టపర్తి అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న సీహెచ్‌ఓల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏపీ ఎంపీసీఏ నాయకులు కోరారు. శనివారం సాయంత్రం ఏపీ ఎంపీసీఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీసీఏ జిల్లా అధ్యక్షుడు కార్తీక్‌రెడ్డి జనరల్ సెక్రటరీ నందీశ్వరరెడ్డి మాట్లాడుతూ జీత భత్యాల విషయంలో సీహెచ్‌ఓలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలని, నేషనల్ హెల్త్ స్కీంలో ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థికమైన, ఆర్థికేతర సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చందన, వేణుగోపాల్, సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.