
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి దుర్మరణం
ఉరవకొండ: స్థానిక నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన వెంకటేష్ నాయక్ (51) ఆదివారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో ఉరవకొండకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పీసీ ప్యాపిలి వద్దకు చేరుకోగానే బస్సు కోసం వేచి ఉన్న అదే గ్రామానికి చెందిన శాంతమ్మ(33) అభ్యర్థన మేరకు ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఉరవకొండ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్పు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వెంకటేష్‌నాయక్ భార్య ఏడాది క్రితమే చెందింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పీసీ ప్యాపిలికి చెందిన శాంతమ్మ భర్త వన్నూరు స్వామి ఉరవకొండలోని ఓ హోటల్‌లో సప్లయిర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తమ్ముడి నిశ్చితార్థానికి వెళుతూ..
అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న ప్రవల్లిక.. ఉరవకొండలో భర్త మల్లికార్జునతో పాటు కలసి నివాసముంటుంది. ఈ క్రమంలో రోజూ బస్సులో విధులకు వెళ్లి వచ్చేవారు. వజ్రకరూరు మండలం చాబాలలో ఉన్న తన తమ్ముడి వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఆదివారం భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మల్లి కార్జునకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ రెండు ఘటలపై సీఐ మహనంది కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి దుర్మరణం