క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ వెంకటేశులు | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ వెంకటేశులు

Published Mon, Apr 21 2025 8:15 AM | Last Updated on Mon, Apr 21 2025 8:15 AM

క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ వెంకటేశులు

క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ వెంకటేశులు

రాప్తాడు: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశులు సకాలంలో తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. రాప్తాడుకు చెందిన యువకుడు చెడిపోతుల కుళ్లాయప్ప ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళుతూ జేఎన్‌టీయూ మార్గంలోని భారత్‌ గ్యాస్‌ కార్యాలయం ఎదుట డివైడర్‌ను ఢీకొని తీవ్ర గాయాలతో పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108కు సమాచారం అందించారు. అయితే ఎంతకూ 108 వాహనం రాలేదు. ఈ లోపు కుళ్లాయప్ప పరిస్థితి విషమిస్తుండడంతో తన సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశులు అప్రమత్తయ్యారు. అప్పటికే ఇంటికి వాహనంలో బయలుదేరిన ఆయన వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న కుళ్లాయప్పను స్థానికుల సాయంతో తానే పైకి లేపి తన వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో స్థానికంగానే తొలుత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అటు నుంచి బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, క్షతగాత్రుడిని తన వాహనంలో ఆస్పత్రికి చేర్చిన డీఎస్పీ చొరవను స్థానికులు అభినందిచారు. ‘ఈ సార్‌ చాలా మంచోడు’ అంటూ కితాబునిచ్చారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

రొళ్ల: మండలంలోని చర్లోపల్లి గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతూ పది మంది పట్టుబడ్డారు. ఎస్‌ఐ వీరాంజనేయులు తెలిపిన మేరకు... అందిన సమాచారంతో ఆదివారం సాయంత్రం మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌ నేతృత్వంలో చర్లోపల్లి గ్రామ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పేకాట ఆడుతూ పది మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.72,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సూపర్‌ మార్ట్‌లో

యువతిపై దాడి

అనంతపురం: నగరంలోని శాంతినగర్‌ వద్ద ఉన్న వియాన్సీ ఫ్యామిలీ మార్ట్‌లో ఓ యువతిపై దాడి జరిగింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్‌ తెలిపిన మేరకు... అనంతపురంలో నివాసముంటున్న గుంటూరు హరిత తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో తన చిన్నాన్న పర్యవేక్షణలో ఉంటూ ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన చిన్నాన్న నిర్వహిస్తున్న వియాన్సీ ఫ్యామిలీ మార్ట్‌లోని నగదు కౌంటర్‌ వద్ద వ్యాపార లావాదేవీలను చూస్తుంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10:30 గంటలకు స్కార్పియో వాహనంలో మార్ట్‌కు చేరుకున్న సాకే నాగమణి, పయ్యావుల లోకనాథ్‌, డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ ఓ బాస్కెట్‌ తీసుకుని అందులో తమకు కావాల్సిన సరుకులు వేసుకుని బిల్లింగ్‌ కౌంటర్‌ వద్దకు చేరుకున్నారు. వాటికి బిల్‌ వేయడంతో రూ.200 అయింది. వారి వద్ద ఉన్న క్లాత్‌ బ్యాగ్‌లో వేసుకున్న వస్తువులు కూడా బయటకు తీయాలని అక్కడున్న అనిల్‌ తెలిపాడు. తాము ఎలా కనిపిస్తున్నామంటూ వారు దబాయించారు. దీంతో షాపింగ్‌ చేస్తున్న సమయంలో తాము సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అందులో వారు కొన్ని వస్తువులు బ్యాగ్‌లో వేసుకోవడం స్పష్టంగా గమనించినట్లు తెలపడంతో సాకే నాగమణి రెచ్చిపోయి హరిత జట్టు పట్టి లాగి కొట్టారు. అదే సమయంలో హరితపై పయ్యావుల లోక్‌నాథ్‌, డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ దాడి చేయబోతుండగా తప్పించుకునినే ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. తలుపులు బద్దలుగొట్టేందుకు లోకనాథ్‌, దుర్గాప్రసాద్‌ ప్రయత్నిస్తుండడంతో అక్కడున్న సిబ్బంది అడ్డుకుని సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ శాంతిలాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement