
వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మి ఉత్సవాలు
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ‘పోతులరాజు పుష్పాలంకారణ మహోత్సవం’లో భాగంగా మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మంగళవాయిద్యాల నడుమ ఆలయం వద్దకు చేరుకుని ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య వైభవంగా నిర్వహించారు. మహిళలు దేవాలయ సమీపంలోని పాలబావిలో గంగపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశారు. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం లేని వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. జాతరలో తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు పాల్గొన్నారు. ఉత్సవాల్లో సోమవారం పాలబావిలో గంగపూజతో పాటు రాత్రికి పోతులరాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తదితరులు తెలిపారు.
భక్తిశ్రద్ధలో పోతులరాజు పుష్పాలంకరణ

వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మి ఉత్సవాలు