
కానిస్టేబుల్‌పై దాడి
ధర్మవరం అర్బన్: విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపిన మేరకు.. ఆదివారం రాత్రి 10.30 గంటలకు బీట్‌లో భాగంగా స్థానిక కదిరి గేటు వద్దకు కానిస్టేబుల్ విశ్వనాథ్ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ రాజు అనే వ్యక్తి ఎగ్‌రైస్ బండి నిర్వహిస్తుండడం గమనించి, సమయం మించి పోయిందని, వ్యాపారాన్ని ఆపి ఇంటికెళ్లాలని సూచించారు. దీంతో రాజు వాగ్వాదానికి దిగాడు. ఎంత సర్ది చెప్పినా వినకుండా తన స్నేహితులను పిలిపించుకుని కానిస్టేబుల్ విశ్వనాథ్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజు, అతని స్నేహితులు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
● 20 రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటన
బత్తలపల్లి: మండలంలోని యర్రాయపల్లి ఓబులేసుని కొండలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని గొర్రెల కాపరులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని తాడిమర్రి మండలం పూలఓబయ్యపల్లికి చెందిన శెట్టిపల్లి శివారెడ్డి(43)గా గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించి మృతుడిని శివారెడ్డిగా నిర్ధారించి, బోరున విలపించారు. ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ ఫర్టిలైజర్ షాపులో పని చేస్తున్నట్లు తెలిపారు. ఉగాది పండుగ నుంచి కనిపించకుండా పోయాడని.. ఘటనపై అప్పట్లోనే ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కాగా, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దుర్మరణం
చెన్నేకొత్తపల్లి: ద్విచక్ర వాహనాలు కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన సాయితేజ (24) సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి బయలుదేరాడు. ప్యాదిండి గ్రామానికి అదే గ్రామానికి చెందిన రమేష్ మరో ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి వెళుతూ సాయితేజ వాహనం వెనుకనే అనుసరించసాగాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోకి చేరుకోగానే ధర్మవరం వైపు నుంచి ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు తొలుత సాయితేజ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, తర్వాత వెనుకనే ఉన్న రమేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఘటనలో సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను స్థానికులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వెద్యం కోసం అనంతపురానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఘటనపై సీకే పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.