
డ్రిప్ మంజూరులో జిల్లాకు నాలుగో స్థానం
అనంతపురం సెంట్రల్: డ్రిప్, స్పింక్లర్ల మంజూరులో రాష్ట్రంలో అనంతపురం జిల్లా మొదటి స్థానం, జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలో ప్రాంతీయ ఉద్యాన శిక్షణా సంస్థ కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా రాష్ట్రంలో నాలుగు, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉందని అభినందించారు. రైతుల పొలాల్లో పరికరాలను త్వరితగతిన అమర్చి సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంద శాతం రైతులు డ్రిప్ వాడేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అనంతపురం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు రఘునాథరెడ్డి, సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఏపీఎంఐపీ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి
పరిగి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరికి మండలంవిట్టాపల్లికి చెందిన రవికుమార్ (33).. రొద్దం మండలం ఎం.కొత్తపల్లిలోని అత్తారింటికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తిరిగి తనస్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన.. పైడేటి సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
● ఎస్‌టీయూ నాయకుల డిమాండ్
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామక తేదీని అందరికీ ఒకేలా ఉండేలా చూడాలని ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ కృష్ణప్పను సోమవారం కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నియామక పత్రాలను 2010, నవంబర్ 6న ఇచ్చారన్నారు. అయితే కొందరు ఎంఈఓలు నవంబర్ 4, 5, 8 తేదీల్లో జాయినింగ్ డేట్ ఇవ్వడంతో ట్రాన్స్‌ఫర్ సీనియారిటీలో మెరిట్ ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోందన్నారు. దీంతో 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు కామన్ జాయినింగ్ తేదీని ఇవ్వాలన్నారు. అలాగే 2009లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సైతం జాయినింగ్ తేదీల సమస్యలు నెలకొన్నాయని, వీటిని కూడా పరిష్కరించాలన్నారు. ఎల్‌ఎఫ్‌ఎల్ టూల్ ఇండక్షన్ ట్రైనింగ్, పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి రవిచంద్ర, వెంగమనాయుడు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల అద్యక్షులు శివయ్య, శ్రీనివాసులు, శంకర్ నాయుడు, షెక్షావలి, సురేష్, కృష్ణప్ప, అనిల్‌కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
‘పురం’ వాసికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
హిందూపురం: స్థానిక మిషన్ కాంపౌండ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్‌రాజ్ కుమారుడు పి.ఇమ్మానుయేల్ రాజ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 2024, డిసెంబర్ 1న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 1,046 మంది సంగీత కళాకారులు కీబోర్డు వాయించి ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని రికార్డుగా గుర్తిస్తూ ఇటీవల హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఇమ్మానుయేల్ రాజుకు సర్టిఫికెట్, గోల్డ్ మెడల్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అందజేశారు.

డ్రిప్ మంజూరులో జిల్లాకు నాలుగో స్థానం

డ్రిప్ మంజూరులో జిల్లాకు నాలుగో స్థానం

డ్రిప్ మంజూరులో జిల్లాకు నాలుగో స్థానం