
బిందెడు నీటికి బండెడు కష్టాలు
రాయదుర్గం: ఉమ్మడి జిల్లాల్లోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కూటమి సర్కార్ ఘోర వైఫల్యాల కారణంగా పల్లెలన్నీ గొంతెండుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు పొలాల వెంబడి పరుగు తీస్తున్నారు.
16 రోజులుగా నిలిచిపోయిన
తాగునీటి సరఫరా
లక్షలాది మంది గొంతు తడిపే అతిపెద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని అధికారం చేపట్టి పట్టుమని పది నెలల కాకనే చంద్రబాబు సర్కార్ అటకెక్కించింది. నిర్వహణ చేతకాక చేతులెత్తేసింది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో 16 రోజులుగా కార్మికులు సమ్మె బాటపట్టారు. దీంతో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం లబ్ధి పొందుతున్న గ్రామాల్లో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయ బోర్లే దిక్కు
ఉమ్మడి జిల్లాల్లోని చాలా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. విద్యుత్ సరఫరా ప్రారంభం కాగానే పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. రైతుల నుంచి ఎదురయ్యే ఛీత్కారాలను మౌనంగా భరిస్తూ తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి కష్టాలు చూసిన ట్యాంకర్ల నిర్వాహకులు ధర అమాంతం పెంచేశారు. పట్టణాల్లో ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్లు వస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
సమ్మె విరమిస్తేనే ప్రయోజనం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో 800 మంది కార్మికులు పనిచేస్తుండగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో ఆ సంఖ్య 630కి కుదించారు. సూపర్‌వైజర్లు మరో 20 మంది ఉన్నారు. నిత్యం 47 ఎంల్‌డీ నీటిని ఉరవకొండ నియోజకవర్గం పీఏబీఆర్ పంప్‌హౌస్ నుంచి పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో కార్మికుల వేతన బకాయిలు రూ.8 కోట్లకు చేరుకుంది. పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేసినా... చర్చల పేరుతో కార్మికులను మభ్య పెట్టారు తప్ప సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నిండు వేసవిలో 16 రోజులుగా తాగునీటి పథకం ద్వారా నీరందక పోవడంతో ప్రజల ఇక్కట్లు నానాటికీ జటిలమవుతున్నాయి. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితేగాని సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు.
కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వీర్యం
వేతనాలు అందించలేని దుస్థితిలో ‘బాబు’ సర్కార్
ఈ నెల 6 నుంచి సమ్మెలో కార్మికులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 727 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా

బిందెడు నీటికి బండెడు కష్టాలు