ఆ నవ వధువు కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఆ కుటుంబంలోని ఆనందమంతా ఆవిరైపోయింది. చదువు, ఉద్యోగం, వివాహం అంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ఆ యువకుడి జీవితం అక్కడితోనే ముగిసిపోయింది. కొల్లవానిపేట రైల్వేగేటు వద్ద కాపు కాచిన మృత్యుదేవత నవ వరుడిని తనతో తీసుకెళ్లిపోయింది. రెండు నెలల కిందటే వివాహం చేసుకున్న ఆ యువకుడి మృతితో కుటుంబం తల్లడిల్లిపోయింది.
నరసన్నపేట: చక్కగా చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మరో ఉద్యోగినితో వివాహం జరిగింది. ఇక జీవితమంతా హాయిగా కలిసి బతక వచ్చని ఆశ పడిన ఆ వధూవరులపై విధి పగబట్టింది. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది. నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మట్ట సోమేశ్వరరావు (28) కొల్లవానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం 10.20 గంటల సమయంలో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు నిమిషాల్లో కామేశ్వరిపేట చేరుకుంటాడనగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళంలోని బలగకు చెందిన మట్ట శ్యామలరావు కుమారుడు సోమేశ్వరరావు చక్కగా చదువుకున్నాడు. సచివాలయంలో ఇంజినీరింగ్ సహాయకుడిగా ఉద్యోగం వచ్చింది. మంచి సంబంధం రావడంతో రెండు నెలల కిందటే వివాహం చేశారు. ఆమె కూడా రణస్థలం మండలంలోని సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ లాగానే సోమేశ్వరరావు బుధవారం తన బండిపై కామేశ్వరిపేటలోని సచివాలయానికి బయల్దేరాడు. దారిలో కొల్లవానిపేట వద్ద గేటు వేశారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు సోమేశ్వరరావు ప్రాణాలు తీశాయి.
గేటు లేవడంతోనే..
సరిగ్గా ఉదయం 10.16కు కొల్లవానిపేట గేటు వేసి ఉంది. రెండు వైపులా వాహనాలు నిలిచి ఉన్నాయి. ఆమదాలవలస నుంచి తిలారు వైపునకు గూడ్స్ ట్రైన్ వెళ్లింది. ఆ రైలు వెళ్లగానే గేటు లేచింది. దీంతో కొల్లవానిపేట నుంచి ఒక కారు, ఆటో గేటు లోపలికి వచ్చాయి. సోమేశ్వరరావు కూడా తన బండితో ముందుకు కదిలాడు. అంతే.. అదే ట్రాక్‌పై ఊహించని వేగంతో వచ్చిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సోమేశ్వరరావును అమాంతం ఢీకొట్టింది. ఆ ధాటికి అతడి శరీరం తునాతునకలైంది. రైలు పట్టాలన్నీ రక్తంతో తడిచిపోయాయి. క్యారేజీ, హెల్మెట్ ఇలా ఆ యన వస్తువులన్నీ చాలాదూరం ఎగిరిపడ్డాయి. అయితే తమ కళ్ల ముందే ప్రమాదం జరగడంతో గే టు వద్ద ఉన్న వాహనదారులు నిశ్చేష్టులైపోయారు. రెప్పపాటులో తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షులు వేళాల రమేష్, ఆర్.రామకృష్ణ, పుల్లట వెంకటరమణ తెలిపారు. ఆటోలో పది మంది, కారులో నలుగురు ఉన్నారని, వెంట్రుక వాసిలో వీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు.
కన్నీరుమున్నీరు..
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇలా దుర్మరణం పాలవ్వడంతో మృతుని తల్లిదండ్రులు శ్యామలరావు, సరస్వతిలు కన్నీరుమున్నీరయ్యారు. అతని సోదరి గౌతమి కూడా తల్లడిల్లిపోయింది. సోమేశ్వరరావు భార్య జయశ్రీ వేదన చూసి అంతా కన్నీరుపెట్టుకున్నారు. నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు.
కేసు నమోదు..
ఈ ప్రమాదంలో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆమదాలవలస రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఏ ఎస్‌ఐ చిట్టిబాబు, హెచ్‌సీ మధుసూదనరావు వచ్చా రు. రైల్వేగేట్‌మెన్ మధుపర్ మిశ్రో నుంచి వివరణ తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగినట్లు కేసు నమోదు చేశామన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ సోమేశ్వరరావు మృతిపై నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, ఎంపీడీఓ మదుసూదనరావు, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు మోహనరావు, ఉదయ భాస్కర్, పంచాయ తీ కార్యదర్శుల సంఘం మండల విభాగం అధ్యక్షు డు ముకుందరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు దివ్య, కామేశ్వరిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, జోగినాయుడులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment