అచ్చెన్నాయుడివన్నీ అబద్ధాలే
● గత ప్రభుత్వంలో మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మిర్చి రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని, అప్పటి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం మిర్చి రైతులను పట్టించుకోలేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. వైఎస్సార్ సీపీ హయాంలో మిర్చికి గరిష్టంగా రూ.27 వేలు వరకూ ధర పలికిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మిర్చి రైతులు దిగుబడి తగ్గి పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలకు అనుగుణంగా మిర్చితో సహా ఇతర పంటలకూ అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ధరలు ప్రకటించిందని, ఐదేళ్ల తర్వాత ఇప్పటి రేట్లతో పోలుస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ఏమనాలని ప్రశ్నించారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు.
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
శ్రీకాకుళం అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు నగరంలోని కళింగ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ వద్ద బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ కన్వీనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఖండించాలన్నారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అంతేకాకుండా ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలన్నారు. రుణాలకు సంబంధించిన ట్యాక్సుల వసూలు ఆలోచనను యాజమాన్యాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు గిరిధర్ నాయక్ మాట్లాడుతూ బ్యాంకుల్లో తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. బ్యాంకుల్లో తాత్కాలిక నియామకాలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ జి.కరుణ, కో–ఆర్డినేషన్ జాయింట్ కార్యదర్శి ఎ.సూర్య, ఓబీసీ ఉద్యోగ సంఘ నాయకులు సూర్యకిరణ్, నరేష్, శ్రీనివాస్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
28న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
ఇచ్ఛాపురం రూరల్: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఇచ్ఛాపురం మండలం ఇన్నేశుపేటలో ఈ నెల 28న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సైనికోద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు 3,4,5 తరగతుల విద్యార్థులు అర్హులని, వివరాలకు 9441569363 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
అకాల వర్షం.. రైతన్నల హర్షం
మెళియాపుట్టి: మండలంలోని జాడుపల్లి, పెద్దమడి, చీపురుపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. ఎండ నుంచి ఉపశమనం లభించడంతో పాటు నువ్వు, పసుపు, కూరగాయలు, వేసవి వరి సాగుకు ఈ వర్షం ఉపకరిస్తుందని రైతులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో వర్షాలతో జీడి మామిడి పువ్వు, పిందె రాలటం ఆగి పంట దిగుబడులు పెరుగుతాయని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు.
అచ్చెన్నాయుడివన్నీ అబద్ధాలే
అచ్చెన్నాయుడివన్నీ అబద్ధాలే
Comments
Please login to add a commentAdd a comment