పంచకర్మ దశలు..
టెక్కలి:
మారుతున్న కాలంతో పాటు విస్తరిస్తున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఎంతో మంది ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ఆదరణ ఉంది. ఆయుర్వేద వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023లో కేంద్ర ఆయుష్ విభాగం జిల్లాలో కోటబొమ్మాళి ఆయుర్వేద ఆసుపత్రిలో ‘పంచకర్మ చికిత్స’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్‌ట్రిక్, చర్మవ్యాధులు, మూలవ్యాధులు, నరాల సమస్యలు, సయాటికా, మైగ్రేన్, వెన్నెముక సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఈ పంచకర్మ వైద్యాన్ని వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఆయుర్వేద ఆసుపత్రులలో ఈ పంచకర్మ వైద్య సేవలు ఉండగా, అందులో కోటబొమ్మాళి ఆయుర్వేద ఆసుపత్రి ఒకటి కావడం విశేషం. డాక్టర్ వివేకానంద ఆధ్వర్యంలో పంచకర్మ చికిత్సలతో పాటు ఆయుర్వేదిక్ మొక్కలతో హెర్బల్ గార్డెన్ పెంచుతున్నారు.
బహుళ ప్రయోజనాలు...
శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచడం, విష పదార్థాల విసర్జన చేయడం, జీవక్రియను వేగవంతం చేయడం, బరువు తగ్గడం, జీర్ణ అగ్ని బలాన్ని పెంచడం, మానసిక, శారీరక విశ్రాంతి, కణజాలాల పునరుజ్జీవనంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడిని తగ్గించడంలో ఈ వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
వామన కర్మ: కఫాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడటానికి ప్రేరేపిత వాంతులు ఉంటాయి. దీని ద్వారా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులను నిరోధిస్తారు.
విరేచన కర్మ: జీర్ణ సమస్యలను నియంత్రించడానికి ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు. కడుపులో పేరుకుపోయిన విషాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
వస్తి కర్మ: వాతాన్ని సమతుల్యం చేయటానికి సూచించిన నూనెలు, కషాయాలను యానోరెక్టల్ మార్గం ద్వారా వైద్యం చేస్తారు.
నశ్య కర్మ: నాసికా రంధ్రం ద్వారా వైద్యం అందజేస్తారు. మైగ్రేన్ సమస్యలను తగ్గించడానికి ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు.
రక్తమోక్షణ కర్మ: శరీరంలో ఉన్న అపరిశుభ్రమైన రక్తాన్ని తొలగించడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తారు. కొన్ని రకాల పరికరాలతో ఈ వైద్యం చేస్తారు.
కోటబొమ్మాళి ఆయుర్వేద ఆస్పత్రిలో
అందుబాటులో చికిత్సలు
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరం
రాష్ట్రంలో 13 ఆస్పత్రుల్లోనే ఈ రకమైన వైద్యసేవలు
కోటబొమ్మాళి ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పంచకర్మ చికిత్సను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి. చికిత్సతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నాం. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్‌ట్రిక్, చర్మవ్యాధులు, మూలవ్యాధులు, నరాల సమస్యలు, సయాటికా, మైగ్రేన్, వెన్నెముక సంబంధిత సమస్యలకు వైద్యం అందజేస్తాం.
–డాక్టర్ కె.వివేకానంద, ఎండీ, ఆయుర్వేదిక్, కోటబొమ్మాళి
ప్రత్యేకం..పంచకర్మ వైద్యం
ప్రత్యేకం..పంచకర్మ వైద్యం