గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Mar 17 2025 12:21 AM | Updated on Mar 17 2025 12:21 AM

గుర్త

గుర్తు తెలియని వ్యక్తి మృతి

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపారు. ఈ నెల 13న ఉదయం 11.15 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్సు సమీప జడ్జి బంగ్లా ఎదురుగా మురుగు కాలువలో బోర్లా పడివున్న వ్యక్తిని చూసి సమీప ఆటో డ్రైవర్లు బయకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందాడు. వివరాలు తెలిసిన వారు 6309990824, 6309990843 నంబర్లకు తెలియజేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

‘కులం పేరిట బెదిరిస్తున్నారు’

టెక్కలి: తనను కులం కార్డుతో బెదిరిస్తూ పోలీసులతో భయపెడుతున్నారని, వీటి నుంచి రక్షణ కల్పించాలని టెక్కలి మండలం పెద్దసాన ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.నేతాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కొంత మంది పేర్లను ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన క్రమంలో గ్రామంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఆందోళన చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యను కొలిక్కి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆన్‌లైన్‌లోనే ఐపీఎల్‌ టికెట్లు

శ్రీకాకుళం న్యూకాలనీ: బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్‌ టోర్నీకి సంబంధించి విశాఖపట్నంలో జరిగే రెండు మ్యాచ్‌లకు అభిమానులు ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పీవైఎన్‌ శాస్త్రి, హసన్‌రాజా, మెంటార్‌ ఇలియాస్‌ అహ్మద్‌, కోశాధికారి మదినా శైలానీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం మధురవాడలోని ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ తన రెండో క్రికెట్‌ మైదానంగా ఎంపిక చేసుకుందని చెప్పారు. ఈ నెల 24న సాయంత్రం 7.30 గంటలకు లక్నో సూపర్‌జెయింట్స్‌తో, 30న మధ్యాహ్నం 3.30 గంటలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుందని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లకు ఏసీఏతో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవడంతో మ్యాచ్‌లకు సంబంధించి ఎలాంటి టికెట్లు ఏసీఏ జిల్లా క్రికెట్‌ సంఘానికి సమకూర్చడంలేదని వారు స్పష్టంచేశారు. ఆసక్తి కలిగిన వారు డిస్ట్రిక్ట్‌ యాప్‌లో టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

ట్రెజరీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ ట్రెజరీ, అకౌంట్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఎన్నికలు ఆదివారం జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా నాజర్‌బాగ్‌ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా పైడి వెంకటరమణ, అసోసియేట్‌ అధ్యక్షుడిగా పొలుగుమటి గంగరాజు, ఉపాధ్యక్షులుగా మీసాల రమేష్‌నాయుడు, పేరాడ మన్మధరావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎం.షల్మ, కార్యదర్శిగా పుప్పాల శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా బోర శ్రీధర్‌, జాయింట్‌ సెక్రటరీలుగా చిట్టి చంద్రశేఖర్‌, పూలి సింహద్రిరాజు, మహిళా కార్యదర్శిగా మామిడి మీనాక్షి, ట్రెజరర్‌గా సలాడి సూర్యచంద్ర ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఖజానా ఉద్యోగులు బెండి మోహనరావు, సత్యనారాయణ తదితరులు అభినందించారు.

పది కేజీల వెండి చోరీ

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్‌లో పాడి చంద్రశేఖరరావు ఇంట్లో దొంగలు చొరబడి పది కేజీల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. స్వ గ్రామం నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి సంబరం నిమిత్తం ఈ నెల 14న వెళ్లి తిరిగి 15వ తేదీన ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలుకొట్టి కనిపించాయని, లోపలికి వెళ్లి చూడగా కెండి కంచం, అష్టలక్ష్మి చెంబులు, చిన్నచెంబులు, వెండి దీపం కద్దులు, వెండి ప్లేట్‌లు, పంచపాత్రి, వెండికప్పులు, బరినెలు, గిన్నెలు, పట్టీలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘనంగా తెరవే సాహితీ సమ్మేళనం

శ్రీకాకుళం కల్చరల్‌: తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 102వ నెల సాహితీ సమ్మేళనం నగరంలోని శాంతినికేతన్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్‌.వి.రమణమూర్తి నిర్వహణలో సంస్థ సభ్యులు కవులు, రచయితలు సామాజిక పరమైన కవితలను, పద్యాలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఇద్ది పాపయ్య, పి.వి.దుర్గాప్రసాద్‌, కుప్పిలి త్రినాథరావు, తంగి ఎర్రమ్మ, ఐఎన్‌డీ ప్రసాద్‌, ఎల్‌.సత్యానందం, వి.రాజారావు, తోట గోపాలరావు, డాక్టర్‌ కోమలరావు, బి.మోహన్‌గాంధీ, కె.బి.రవికిరణ్‌, కిల్లాన శ్రీనివాస్‌, బి.జగన్నాథరావు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి   1
1/1

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement