శ్రీకాకుళంపాతబస్టాండ్: జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆదిత్యుని సన్నిధిలో ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులకు ఉచితంగా స్థానిక నేతలు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు సోదరులు ఉచితంగా మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశారు. ఇక ఒక్కరోజులో వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.3,82,400, విరాళాలు, ప్రత్యేక పూజల ద్వారా రూ.73,523, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1,45 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా సూపరింటెండెంట్ ఎస్.కనకరాజు తెలియజేశారు.