అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు
● వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన కిడ్నీ ఆస్పత్రిపై అసత్యాలు
● మిషన్లు లేవు.. సిబ్బంది లేరంటూ విషం చిమ్మిన మంత్రి
● ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన పరికరాలు
● అప్పట్లోనే 154 మందికి పైగా సిబ్బంది నియామకం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పారు. పలాస కిడ్నీ రోగులకు ప్రాణం పోసిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మారు. కిడ్నీ రోగుల కోసం పలాసలో కేవలం ఆస్పత్రి భవనం మాత్రమే కట్టారంటూ అసత్యాలు పలికారు.
ఉద్దానంలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలు కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలు. ఇక్కడి బాధితులు వైద్యం కోసం వ్యయ ప్రయాసలకు గురై విశాఖ వెళ్తుండేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం సుమారు రూ.85కోట్లతో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ కమ్ హాస్పిటల్ నిర్మించింది. వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధునాతన పరికరాలు సమకూర్చింది. దానితో పాటు ఉద్దానం ప్రాంత ప్రజలకు వైఎస్‌ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించింది. కిడ్నీ రోగులకు అండగా నిలిచి వారికి ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులు, రవాణా సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.
ఇంత చేస్తే మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. సిబ్బంది లేరు.. మిషనరీ లేదని పాత డయాలసిస్ మిషన్లు సీహెచ్‌సీ నుంచి తెప్పించి, ప్రారంభోత్సవం చేసేసి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లిపోయారని గుక్క తిప్పకుండా బొంకారు. అసెంబ్లీ పలాస కిడ్నీ ఆస్పత్రిలో ఎంత మంది సిబ్బంది ఉన్నారో...ఎన్ని మిషన్లు ఉన్నాయో అచ్చెన్నాయుడుకు తెలుసో లేదో అని అక్కడి ప్రజలు అంటున్నారు.
ఆస్పత్రిలో ఉన్న మిషన్లు ఇవి..
డయాలసిస్ కోసం పలాస కిడ్నీ ఆస్పత్రిలో వైఎస్ జగన్ ప్రభుత్వం నెఫ్రోప్లస్‌కు చెందిన 19మిషన్లు పెట్టింది. అందులో నెగెటివ్ మిషన్లు 16, పాజిటివ్ మిషన్లు మూడు ఉన్నాయి. వీటితో పాటు సీటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్ మిషన్, ఆటోమెటిక్ టిష్యూ ప్రొసెసర్, క్రయోస్టాట్, ఆటో మెటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సీ ఆర్మ్ మిషన్, 80 నుంచి 40 సెంటిగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, ఈఎస్‌డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటీ టేబుల్స్, హోల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్లు రీసెర్చ్ ల్యాబొరేటరీలు, వెంటిలేటర్లతో పాటు 25 అత్యాధునిక కంప్యూటర్ ప్రింటర్లు అందుబాటులో ఉంచింది. గత ప్రభుత్వంలోనే అన్ని రకాల పోస్టులు కలిపి 154 భర్తీ చేసింది. అంతేకాకుండా మిగతా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ లోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది.
పలాస కిడ్నీ ఆస్పత్రిలోని డయాలసిస్ వార్డు
అన్నన్నా.. అచ్చెన్నా..!
అన్నన్నా.. అచ్చెన్నా..!
అన్నన్నా.. అచ్చెన్నా..!
అన్నన్నా.. అచ్చెన్నా..!