కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ గాంధీనగర్ ప్రాంతం వివేకానంద కాలనీలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మెట్ట సుదర్శనరావు, భానుమతి దంపతుల ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఈనెల 8వ తేదీన కాశీ పుణ్యక్షేత్రం వెళ్లి తిరిగి సోమవారం వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలుగొట్టినట్లు గమనించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా దేవుడి గదిలో ఉన్నటువంటి పన్నెండు తులాల బంగారం, ముప్‌పై తులాల వెండి, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు తెలియజేయడంతో హుటాహుటిన క్లూస్ టీమ్ చేరుకుని వేలిముద్రలను సేకరించారు. కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా వరుస దొంగతనాలతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉత్తరాంధ్ర యాదవులను బీసీ–బీలో చేర్చాలి
కవిటి: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో నివసిస్తూ గొల్లలుగా పిలవబడుతున్న యాదవులను ప్రస్తుతం ఉన్న బీసీ–డీ రిజర్వేషన్ కేటగిరీ నుంచి, బీసీ–బీలుగా మార్చాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. సోమవారం శాసన మండలిలో ఈ అంశానికి సంబంధించిన విషయాలను ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబాటులో ఉన్నారని, బీసీ కమిషన్ ద్వారా అధ్యయనానికి కమిటీ వేసి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ సిబ్బందికి
కంప్యూటర్ శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ శాఖల సిబ్బందిని నేటి నుంచి 22 వరకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల నుంచి ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి సత్వరమే అందజేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్, అడ్వాన్స్ టూల్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 18, 19 తేదీల్లో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందికి, జిల్లా కేంద్రంలో ఉన్న ఆయా శాఖల సిబ్బందికి కలిపి 100 మంది ఉద్యోగులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్ శిక్షణ ఉంటుందని తెలిపారు. మార్చి 20వ తేదీన టెక్కలి డివిజన్ కేంద్రంలో 40 మందికి, మార్చి 21న పలాస డివిజన్ కేంద్రంలో 30 మందికి, మార్చి 22న శ్రీకాకుళం డివిజన్ కేంద్రంలో 30 మంది ఉద్యోగులకు శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు.
శాసన మండలిలో
మాట్లాడుతున్న
ఎమ్మెల్సీ నర్తు రామారావు