ప్రభుత్వ భవనాల
● పొన్నాంలో ఆర్‌బీకే, వెల్‌నెస్ సెంటర్ భవనాల కబ్జాకు స్కెచ్ ● భవనాలకు గోడలు కట్టిస్తున్న విశ్రాంత వీఆర్‌ఓ ● గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన సర్పంచ్, గ్రామస్తులు ● పట్టించుకోని రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు
శ్రీకాకుళం రూరల్ : మండలంలోని పొన్నాం పంచాయతీ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ పోరంబోకు స్థలంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ భవనాల ఆక్రమణకు రంగం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ విభాగం ద్వారా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో శ్లాబ్‌ల నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనాలపై అదే గ్రామానికి చెందిన ఓ రిటైర్ట్ వీఆర్వో కన్నుపడింది. తనకున్న పలుబడి, కూటమి నాయకుల సహయ సహకారాలతో వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రస్తుతం గోడలు సైతం కట్టేస్తున్నాడు.
ఇదీ పరిస్థితి..
పొన్నాం పంచాయతీ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ పోరంబోకు సర్వేనెంబర్ 287లో 65 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఈ స్థలం ప్రభుత్వ పోరంబోకుగానే ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు సైతం చూపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రానికి రూ.21.80 లక్షలు, వెల్‌నెస్ సెంటర్‌కు రూ.17.50 లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ రెండు భవనాల నిర్మాణం శ్లాబ్ దశకు వచ్చి ఆగింది. భవన నిర్మాణం కొనసాగుతున్న కొద్ది రెండింటికి కలిపి ఇప్పటికి సుమారు రూ.20 లక్షల నిధులు కూడా ప్రభుత్వం విడుదలచేసింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవనాలను అదే గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ వీఆర్వో తనకున్న పలుబడితో ఏకంగా వాటికి గోడలు కట్టేందుకు పూనుకున్నాడని అదే గ్రామానికి చెందిన దుడ్డు ముత్యాలనాయుడు, గొండు రమేష్, దుంగ సత్యం, గుండ రమేష్, తదితర గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భవనాల నిర్మాణం జరిగేటప్పుడు ప్రశ్నించని సదరు విశ్రాంత వీఆర్‌ఓ ప్రభుత్వం మారాక ఒక్కసారిగా శ్లాబ్ వేసిన బిల్డింగ్‌లకు నాలుగు వైపులా ఎలా గోడలు కడతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పునాదులు తీసినప్పుడు గానీ, పిల్లర్లు వేసినపుడు గానీ ఆభూములకు ఎటువంటి కాగితాలు, పత్రాలు అప్పట్లో చూపని సదరు వ్యక్తికి ఇప్పటికిప్పుడు భూమి పత్రాలు ఎలా పుట్టుకొచ్చాయని వారు ప్రశ్నించారు.
వారిదే బాధ్యత..
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆ రెండు భవనాలను మాకు ఇంకా అప్పగించలేదు. నిర్మాణం చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులే ఆ భవనాలను చూసుకోవాలి. మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తున్నట్లు తెలిసింది.
– బి.శైలజ, ఎంపీడీఓ, శ్రీకాకుళం