● అర తులం బంగారు గొలుసును పోగొట్టుకున్న ప్రయాణికురాలు ● తిరిగి అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగులు
శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు తన కుమార్తె మెడలో వేసిన అర తులం(6గ్రాములు) బంగారు గొలుసును పోగొట్టుకుంది. బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఆ గొలుసు దొరకడంతో ప్రయాణికురాలికి తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం పలాస డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఇచ్ఛాపురం నుంచి విశాఖ బయలుదేరింది. పలాస చేరుకున్న తర్వాత కొత్తపల్లి మౌనిక తన కుమార్తెను తీసుకుని శ్రీకాకుళం వెళ్లేందుకు బస్సు ఎక్కింది. గమ్యస్థానమైన శ్రీకాకుళం కాంప్లెక్స్‌లో కుమార్తెతో సహా దిగిపోయింది. ఆ సమయంలో కుమార్తె మెడలో ఉన్న అర తులం బంగారు గొలుసును జారవిడుచుకుంది. ఈ విషయం గమనించని తల్లి, కుమార్తెలు బస్సు దిగి వెళ్లిపోయారు. ఇంతలో కండక్టర్ సీహెచ్ బెహరా, డ్రైవర్ పి.ఎస్.రావులకు ఆ గొలుసు దొరకడంతో స్టేషన్ మేనేజర్ ఎంపీ రావుకు అందజేశారు. కొద్దిసేపటి తర్వాత బంగారు గొలుసు పోగొట్టుకున్న మౌనిక బస్సు వద్దకు వచ్చి ప్రయాణికులకు చెప్పగా వారు కండక్టర్, డ్రైవర్లకు గొలుసు దొరికిందని, అధికారులకు అందజేయడానికి వెళ్లారని తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ అధికారులు, కండక్టర్, డ్రైవర్ సమక్షంలో గొలుసును మౌనికకు అందజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్‌ను అధికారులు అభినందించారు. కార్యక్రమంలో ఏడీసీ మొజ్జాడ హాటకేశ్వరరావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.