● గెద్దలపాడు గ్రామపెద్దలను
హెచ్చరించిన ఆర్డీఓ కృష్ణమూర్తి
టెక్కలి: గ్రామ బహిష్కరణ సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి హెచ్చరించారు. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో ఆశా వర్కర్ చంద్రమ్మ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటనపై బుధవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో గ్రామపెద్దలు, యూనియన్ నాయకులు, బాధితులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఉద్యోగాల అమ్మకాలు, బలవంతపు రాజీనామాలు చేయించడం, కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేయడం వంటి సంఘటనలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బాధితురాలు చంద్రమ్మ, కుటుంబ సభ్యులు కలిసి టెక్కలి డీఎస్పీ డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్.మూర్తికి ఫిర్యాదు చేశారు. తన ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఉద్యోగాన్ని అమ్మకానికి పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.