ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దు
శ్రీకాకుళం క్రైమ్/పాతపట్నం/హిరమండలం : వైద్యులిచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మినా.. గడువు ముగిసిన మందులు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం రీజనల్ విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు మెడికల్ దుకాణదారులను హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలో ఏకకాలంలో తొమ్మిది మెడికల్ షాపుల్లో విజిలెన్సు, డ్రగ్ కంట్రోల్, ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు.
ఎక్కడెక్కడ అంటే..
శ్రీకాకుళం కేంద్రంగా డేఅండ్‌నైట్ సమీప శ్రీనివాస మెడికల్స్, అమరావతి మెడికల్స్, ఇలిసిపురం రైతు బజారు సమీప మహలక్ష్మి మెడికల్స్, గుజరాతీపేట కూడలి సమీప నీలిమ మెడికల్స్, యునైటెడ్ మెడికల్స్ (చిత్తరంజన్ వీధి), పలాసలో తర్లాన వాసుదేవరావు మెడికల్స్, కాశీబుగ్గలో శ్రీ మెడికల్స్, పాతపట్నంలో మధు మెడికల్స్, హిరమండలంలో విజయశంకర్ మెడికల్స్ దుకాణాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. గుజరాతీపేట నీలిమ మెడికల్స్‌తో పాటు పలాస, కాశీబుగ్గ, పాతపట్నం, హిరమండలం మెడికల్స్‌లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు, గడువు దాటిన మందుల అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. మిగతా చోట్ల చిన్న చిన్న లోపాలున్నట్లు గుర్తించి సరిచేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం సరిలేనివారు, నిద్రపట్టని వారికి ఇచ్చే మందులకు ప్రిస్క్రిప్షన్ ఉన్నవీ లేనివీ గుర్తించమని డీజీ హరీష్‌కుమార్ నుంచి ఉత్తర్వులు రావడంతో ఈ దాడులు జరిపామన్నారు. సైక్రియాట్రిక్, హ్యాబిక్యులర్, షెడ్యూల్డ్– హెచ్ డ్రగ్‌లు ఈ జాబితాలోకి వస్తాయని వివరించారు. ఈయనతోపాటు జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఏడీ చంద్రరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాయుడు, విజిలెన్సు ఎస్‌ఐ అశోక చక్రవర్తి,,హెచ్‌సీ కామేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దాడులు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పాతపట్నం మండల కేంద్రంలోని పలు మందుల దుకాణాలను యాజమానులు ముందుగానే మూసివేశారు.
విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు
ఏకకాలంలో తొమ్మిది మెడికల్ షాపుల్లో విజిలెన్సు దాడులు
Comments
Please login to add a commentAdd a comment