
కుక్కల దాడిలో జింక మృతి
ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధిలోని రత్తకన్న గ్రామంలో వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. సమీప కొండల నుంచి దారితప్పి గ్రామంలోనికి ప్రవేశించిన సమయంలో వీధికుక్కలు వెంటపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే గ్రామస్తులకు అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.మురళీకృష్ణనాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ అధికారి ఐ.రాము, ఫారెస్టు బీట్ అధికారులు సిబ్బంది మృతిచెందిన జింకను పరిశీలించారు. గ్రామస్తుల సమక్షంలో బెల్లుపడ వెటర్నరీ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని దహనం చేశారు. ఇదిలా ఉండగా రత్తకన్న సమీపంలోని ఎర్రమట్టి కొండల నుంచి గ్రావెల్‌ను కొందరు అక్రమంగా తవ్వేయడంతో కొండలు కరిగిపోతున్నాయని, అక్కడి వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.