శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్యామ్‌క్రగ్ పిస్టన్ కార్మికుల లేఆఫ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కల్పించాలని కోరుతూ మార్చి 29న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రణస్థలం మండలంలో గల శ్యాంక్రగ్ పిస్టన్స్(రింగ్స్) ప్లాంట్–2 పరిశ్రమలో 200 మంది కార్మికులను లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికులు ఏప్రిల్ 1 నుంచి పనిలో నుంచి తీసివేస్తారని భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీ నర్ కె.నాగమణి, సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసు, వైఎస్సార్ ట్రేడ్ యూనియ న్ జిల్లా నాయకులు ఎస్.వెంకటరావు, ఏఐటీయూ సీ జిల్లా నాయకులు చిక్కాల గోవిందరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రరావు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, శ్యాంపిస్టన్స్ ప్లాంట్–3 వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.