పేదోడి బియ్యంపై కనిపించని కత్తి వేలాడుతోంది. ఈకేవైసీ చేయించుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడం, లక్షన్నర మందికిపైగా ఈకేవైసీ ఇంకా పూర్తి కావాల్సి ఉండడంతో బియ్యంలో కోత తప్పదనే సంకేతాలు బలపడుతున్నాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారు, చదువుల కోసం ఉన్న ఊరు విడిచి వెళ్లిన విద్యార్థుల ఇప్పటికప్పుడు సొంతూళ్లకు రాలేక, ఈకేవైసీ చేయించుకోలేక సతమతమవుతున్నారు. ఈ హడావుడి పనులన్నీ బియ్యంలో కోత పెట్టేందుకేనని సామాన్యులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
● ఈకేవైసీకి మరో రెండు రోజులే గడువు ● 1,70,598 మందికి పూర్తికాని ఈకేవైసీ ● వలసదారులు, విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ● కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. సంక్షేమ పథకాల పేర్లు కూడా జనం మర్చిపోయా రు. ఖాతాల్లో డబ్బు జమ కావడం అన్నది గతంలా మారిపోయింది. ఇప్పుడు పేదోడి బియ్యంపై సర్కారు కన్ను పడింది. ఈకేవైసీ పేరిట ప్రతి రేషన్ కార్డుపైనా ప్రభుత్వం కనిపించని కత్తి వేలాడదీసింది. జిల్లాలో మొత్తం ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీటిలో 19,39,082 మంది సభ్యులు న్నారు. వీరిలో ఇప్పటి వరకు 17,68,484 మందికి ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంకా 1,70,598 మందికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈకేవైసీ పూర్తి కాకపోతే ఆ సభ్యుడికి ఏప్రిల్‌లో రేషన్ నిలిచిపోతుందని క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగు తోంది. బియ్యంలో కోత పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను తెర పైకి తెచ్చిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాన్నీ ఒక్కో యూనిట్‌గా పరిగణించి ఈకేవైసీ ప్రక్రియ జరుగుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈకేవైసీ అవసరం లేదు. మిగిలిన వారు రేషన్ డీలర్లు, వీఆర్‌ఓలు, ఎండీ యూ ఆపరేటర్ల వద్ద తక్షణమే ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పేదల పొట్ట కొడతారా..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల హామీలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలకు కత్తెర వేస్తోందని లబ్ధిదారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. జిల్లా నుంచి వలస వెళ్లిన వారి సంఖ్య చాలా పెద్దది. వీరంతా రేషన్ కార్డుల్లో సభ్యులే. రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. మన జిల్లాలో ఎక్కువ మంది వలస కూలీలు ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఇప్పటికిప్పుడు సొంత గ్రామాలకు రావడం కాని పని. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇది పరీక్షల సమయం. ఇంజినీరింగ్, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. వీరు వచ్చే నెలలో గానీ ఇంటికి చేరలేని పరిస్థితి. దీంతో వీరి బియ్యానికి కూడా కోత పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీకి మరింత గడు వు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలంటూ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
మండలం మొత్తం ఈకేవైసీ ఇంకా
యూనిట్లు అయినవి ఉన్నవి
వజ్రపుకొత్తూరు 71439 63922 7517
సంతబొమ్మాళి 66247 59336 6911
రణస్థలం 83512 74877 8635
ఇచ్ఛాపురం 86492 77845 8647
కొత్తూరు 64752 58430 6322
కంచిలి 62793 56688 6105
టెక్కలి 63662 57610 6052
కోటబొమ్మాళి 65339 59401 5938
బూర్జ 36144 32861 3283
లావేరు 60735 55261 5474
పొందూరు 61664 56145 5519
శ్రీకాకుళం 167636 152698 14938
హిరమండలం 34293 31247 3046
జి సిగడాం 49628 45223 4405
గార 73764 67289 6475
మందస 74858 68309 6549
పలాస 83402 76172 7230
పాతపట్నం 58860 53882 4978
నందిగాం 52071 47717 4354
కవిటి 72177 66272 5905
సోంపేట 71646 65889 5757
పొలాకి 59327 54564 4763
ఆమదాలవలస 68794 63297 5497
ఎచ్చెర్ల 78845 72629 6216
సరుబుజ్జిలి 25872 23836 2036
జలుమూరు 53532 49462 4070
నరసన్నపేట 65507 60620 4887
ఎల్‌ఎన్ పేట 30192 27962 2230
మెళియాపుట్టి 49771 46098 3673
సారవకోట 46128 42942 3186
మొత్తం 19,39,082 17,68,484 1,70,598
● గడువు పెంచే
అవకాశం ఉంది..
ముందుగా ఈ నెల 31వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పాం. అయితే గడువు పెంచే అవకాశం ఉంది. జిల్లాలో వలసలు, ఇతర పరిస్థితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ గడువు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈకేవైసీ వేయకపోయినా రేషన్ సరకులు నిలిపివేయం. ఈకేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనా చెందనవసరం లేదు.
– గుంట సూర్యప్రకాశరావు,
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి
పేదల కడుపుపై