● అధికారుల మాట బేఖాతర్ ● రచ్చబండను నేలమట్టం చేసిన వైనం
ఇచ్ఛాపురం రూరల్: అధికారంలో ఉన్నామన్న అహంకారంతో టీడీపీ నాయకుడు బరితెగించాడు. తన స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి 30 ఏళ్ల నాటి రచ్చబండను నేలమట్టం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కె.శాసనాం గ్రామంలో 30 ఏళ్ల క్రితం స్థానిక గ్రామ పెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రచ్చబండను నిర్మించాడు. అందులో రావి చెట్టును నాటి త్రినాథస్వాముల వారి విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు తన సొంత భూమికి రచ్చబండ అడ్డుగా ఉందంటూ, ఈనెల 19న రచ్చబండను పెకిలించేందుకు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు పోలీసు, రెవెన్యూశాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు ఈనెల 21, 23 తేదీల్లో మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వో సంఘటనా స్థలానికి వెళ్లి కొలతలు తీశారు. రచ్చబండ ప్రభుత్వ స్థలంలో ఉందని, రచ్చబండకు పది అడుగుల దూరంలో ఫకీరు స్థలం ఉందని తేల్చి చెప్పారు. రచ్చబండపై ఫకీరుకు ఎటువంటి అధికారం లేదని, తొలగించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారుల మాటలు బేఖాతరు చేస్తూ, ఇసురు ఫకీరు తన అనుచరులతో ఆదివారం రచ్చబండను కూల్చడంతో పాటు 30 ఏళ్లనాటి చెట్టును తొలగించేశాడు. దీంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పచ్చ తమ్ముడి బరితెగింపు