
ఆకట్టుకున్న రంజాన్ కవి సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ సందర్భంగా స్థానిక కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర ముస్లిం రచయితల వేదిక వ్యవస్థాపకులు కరీముల్లా ఆదేశాల మేరకు సోమవారం జరిగిన కవి సమ్మే ళనం ఆకట్టుకుంది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహ్మద్ రఫీ అధ్యక్షతన ‘హిందూ ముస్లిం భాయిభాయి’ పై జరిగిన ఈ కవి సమ్మేళనంలో పలువురు కవులు రంజాన్ విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేస్తూ చక్కనైన కవితలను చదివారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ మత సామరస్యానికి ప్రతీక ఈ కవి సమ్మేళనం అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సురంగి మోహనరావు చేతుల మీదుగా ఈవేమన కవితా నిలయం తరఫున విశేష వైద్య సేవలు అందిస్తున్న పి.బి.డేవిడ్‌ను ఆరోగ్యమిత్ర బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో కవులు గుడిమెట్ల గోపాలకృష్ణ, వాడా డ శ్రీనివాస్, పసుపురెడ్డి శ్రీను, బోగెల ఉమామహేశ్వరరావు, గుణస్వామి, తంగి ఎర్రమ్మ, బి.సంతోష్ కుమార్, విజయలక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
టైమ్ స్కేల్ అమలు చేయాలి
ఎచ్చెర్ల క్యాంపస్: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌లకు ప్రభుత్వం మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని యూనిటీ వెల్ఫేర్ టీం జిల్లా ఉపాధ్యక్షుడు చిగిలిపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చిలకపాలెంలో సోమవారం సమగ్ర శిక్ష ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం నిర్వహించి, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కనీసం వేతనం అందజేయటం లేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. కనీ సం మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తే ఉద్యో గులకు న్యాయం జరగుతుందని చెప్పారు. పార్ట్ టైమ్ పేరుతో ఉద్యోగులను ఫుల్ టైమ్ వినియోగించుకుంటున్నారని, పార్ట్ టైమ్ పదం తొలగించాలని అన్నారు. ఒకేషనల్ టీచర్లుగా పరిగణించాలని విజ్ఙప్తి చేశారు. ఉద్యోగ భద్రత, కుటుంబ నిర్వహణకు తగ్గ వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ ప్రతినిధులు వై.సత్యనారాయణ, ఎల్.దిలీప్‌కుమార్, తారకేశ్వరరావు పాల్గొన్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
జలుమూరు: యలమంచిలి ఎండల మల్లికార్జున దేవాలయంతోపాటు అక్కురాడ, కొండపోలవలస ఆంజనేయ ఆలయాల గోడలపై అన్య మత సూక్తులు రాసిన వారిని పట్టుకునేందుకు ఆరు బృందాలతో ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని టెక్కలి డీఎస్పీ డీఎస్‌ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. సోమవారం యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస ఆయా దేవాలయాలను మరోసారి పరిశీలించి అర్చకులు, గ్రామస్తులతో మాట్లాడారు. అదే సమయంలో ఎక్కువ మందికి వచ్చిన ఫోన్ కాల్స్ సీడీఆర్‌ను పరిశీలిస్తున్నారు. అనంతరం జలుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ బృందాల అధికారులతో మాట్లాడారు. దుండగులను త్వరలో పట్టుకుంటామన్నారు.

ఆకట్టుకున్న రంజాన్ కవి సమ్మేళనం