
జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలకు వేళాయె..
శ్రీకాకుళం న్యూకాలనీ: యువ, వర్ధమాన క్రికెటర్లకు జిల్లా క్రికెట్ సంఘం శుభవార్త చెప్పింది. కొత్త సీజన్‌లో ఏసీఏ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించనున్న పురుషుల వన్డే, టీ–20 జట్ల ఎంపికలకు సన్నద్ధమైంది. ఈ నెల 4న అండర్–23 ఎంపికలు, 5న అండర్–19 ఎంపికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారుచేసింది. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల క్రికెట్ మైదానం వేదికగా ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల్లో అండర్–19 విభాగానికి 2006 సెప్టెంబర్ ఒకటి తర్వాత, అండర్–23కి 2002 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించి ఉండాలని జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. గతంలో వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో సెలక్షన్ కమిటీలను నియమించి అత్యంత పారదర్శకంగా జిల్లా జట్లను ఎంపికచేసేందుకు సన్నద్ధమౌతున్నారు. క్రీడాకారులు విధిగా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ తెలిపారు. తెలపు యూనిఫాంతోపాటు ఎవరి క్రికెట్ కిట్లను వారే తీసుకురావాలని సూచించారు.