
పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞానభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని అమలు పరచడానికి గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో కరపత్రం విడుదల చేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకుండా అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర, వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. కాగా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా అంబటి దాలినాయుడు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా చాన్ బాషాను నియమించామని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి గాదం వెంకట త్రినాథరావు సమక్షంలో నియామకపత్రాలు అందజేశామని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, కొత్తపల్లి రాంప్రసాద్, సైదుల్లా ఖాన్, ఎస్.కె.బాషా, బాబు, చోడవరం చంద్రశేఖర్, చోడవరం లీలావతి, సూరియా బేగం పాల్గొన్నారు.