
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమావేశమై రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. పల్లె పండుగ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతమయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్ నిర్వహణ, కోర్టు కేసుల పరిష్కారం, వక్ఫ్ ఆస్తుల సర్వే తదితర అంశాలపై సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీఓ భారతి సౌజన్య, వ్యవసాయాధికారి కోరాడ త్రినాథస్వామి, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకర్, హౌసింగ్ పీడీ నగేష్ పాల్గొన్నారు.