
అవగాహన సదస్సు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్‌పై అవగాహన సదస్సు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు తిరుమల విద్యాసంస్థల అధినేత ఎన్.తిరుమలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని రాజులతాళ్లవలస తిరుమల క్యాంపస్‌లో ఉదయం 10 గంటల నుంచి సదస్సు జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 98489 86450, 98489 86451 నంబర్లను సంప్రదించాలని కోరారు.
పచ్చ నేతల హల్‌చల్
ఇచ్ఛాపురం రూరల్: బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కూటమి నాయకులు హల్‌చల్ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కె.రామారావు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఇంటర్వ్యూలకు 402 మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు. అయితే ఈ సమయంలో కూటమి నాయకులు బ్యాంకు అధికారుల పక్కనే కూర్చొని తమ అనుచరులకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. దీంతో సబ్సిడీ రుణాల మంజూరుపై బ్యాంకు అధికారులను సైతం కూటమి నాయకులు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం సరికాదని పలువురు బహిరంగంగా విమర్శించారు.
రైలుకింద పడి మహిళ
మృతి
కాశీబుగ్గ: పలాస జీఆర్పీ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సోంపేట రైల్వేస్టేషన్ యార్డ్ నందు గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి బుధవారం మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో లభించిందని తెలిపారు. మృతురాలు గులాబీ, పసుపు రంగు కలిగిన పంజాబీ డ్రెస్ ధరించి ఉందన్నారు. చామనచాయ రంగు కలిగి ఉండి, శరీరం రెండుగా విడిపోయి ఉందని కానిస్టేబుల్ డి.హరినాథ్ వివరించారు. వివరాలు తెలిసినవారు 99891 36143 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
8 మంది పేకాటరాయుళ్లు అరెస్టు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలో ఉన్నటువంటి నర్సిపురం కాలనీలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులు కాశీబుగ్గ పోలీసులకు బుధవారం పట్టుబడ్డారు. నర్సిపురం కాలనీ లే అవుట్‌లో పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆడుతున్న స్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్లు నుంచి రూ.60,400ల నగదు, పేక ముక్కలు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ ఎస్‌ఐ ఆర్.నరసింహామూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొత్త పాసులు ఇవ్వకపోవడం సరికాదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం నగరంలోని కాంప్లెక్స్ వద్ద కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కొత్తపాసులు ఇవ్వకపోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అండ్ కాలేజీస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగు మన్మథరావు, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు మాధవ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చందు, హరీష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి చివరిలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ, పారామెడికల్ కౌన్సిలింగ్‌లో విద్యార్థులు పలు కళాశాలల్లో నూతనంగా అడ్మిషన్లు పొందారన్నారు. వీరు తమ కళాశాలల ప్రిన్సిపాల్స్ నుంచి బోనిఫైడ్ సర్టిఫికెట్‌తో ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్తే కొత్తపాసులు మంజూరు చేసేందుకు నిరాకరించడం దారుణమన్నారు. పేద విద్యార్థులు కావడంతో పాసులు మంజూరు చేయకపోతే రాకపోకలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

అవగాహన సదస్సు రేపు