
మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం
వజ్రపుకొత్తూరు: మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు బుంగ ధనరాజు, వంక కృష్ణలు మంగళవారం చేపల వేట సాగిస్తుండగా జరిగిన తెప్ప ప్రమాదంలో గల్లంతై మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు పార్టీ తరఫున మృతుని కుటుంబాలకు రూ.50,000 చొప్పున గురువారం ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక సాయం అందించిన వారిలో పార్టీ నాయకులు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, పాలిన శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వాడ మధుకేశ్వరరావు, వైస్ ఎంపీపీ వంక రాజు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు, మత్య్సకార ఐక్యవేదిక నాయకులు ఉన్నారు.
11 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
హిరమండలం: వంశధార నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ఎన్.హనుమంతురావు, ఎస్‌ఐ ఎండీ యాసిన్ హెచ్చరించారు. వంశధార నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 11 ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్, ఎస్‌ఐలు గురువారం ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని భగీరథిపురం, పిండ్రువాడ, ఎంఎల్‌పురం గ్రామాల పరిధిలో వంశధార నది నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని, ట్రాక్టర్ల యజమానులతో కూడా మాట్లాడామని, ఇక్కడ రీచ్ లేదని వివరించామని తెలిపారు. ట్రెంచ్‌లు ఏర్పాటు చేసినా వాటిని కప్పి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, దీనిపై సమాచారం రావడంతో పోలీసులతో కలిసి దాడి చేశామన్నారు. దాడి లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లతోపాటు నదిలో ఉన్న 3 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. వీరికి మెదటి హెచ్చరికగా అపరాధ రుసం వేస్తున్నట్లు తెలిపారు. హిరమండలంలో ఇసుక రీచ్ లేదని, ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జాతీయ స్థాయి హాకీ పోటీలకు వినయ్
శ్రీకాకుళం న్యూకాలనీ: 15వ ఆలిండియా సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి తుంగాన వినయ్ ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఈనెల 4 నుంచి 15వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నగరం వేదికగా జరగనున్నా యి. ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల హాకీ జట్టుకు వినయ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ పోటీల కోసం ఇప్పటికే ఆంధ్రా జట్టుతో కలిసి యూపీ చేరుకున్నాడు. గతనెల 6 నుంచి 8 వరకు గుంటూరులో జరిగిన రాష్ట్రపోటీల్లో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. శ్రీకాకుళం నగరం ఫాజుల్‌బాగ్‌పేట వీధికి చెందిన తుంగాన గోపి కుమారుడు వినయ్.

మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం

మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం