
ఆడపిల్లలు పుట్టారని అడుగుపెట్టనివ్వడం లేదు
● అత్తింటి వద్ద పిల్లలతో కలిసి వివాహిత నిరసన
టెక్కలి రూరల్: ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తనను అత్తవారింట అడుగుపెట్టనివ్వడం లేదని ఓ వివాహిత శనివారం పిల్లలతో కలిసి మండుటెండలో నిరసన వ్యక్తం చేసింది. స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. కోటబొమ్మాళి మండలం సరియా బొడ్డపాడు పంచాయతీ బడ్డిపేటకు చెందిన ఉపాధ్యాయుడు మెట్ట గోపాలకృష్ణతో టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన రాణికి 2017లో వివాహం జరిగింది. వీరికి వేద్విక, స్వాతి అనే ఇద్దరు ఆడ పిల్లలు పుట్టడంతో రెండేళ్లుగా భర్త, అత్తమామలు తమవెంట తీసుకెళ్లడం లేదు. దీంతో రాణి రెండేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. మెళియాపుట్టి మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన భర్తతో రాణి అనేక సార్లు మాట్లాడినా తీసుకెళ్లలేదు. చివరకు ఫోన్ నంబర్ సైతం బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు. దీంతో శనివారం పోలవరం నుంచి గ్రామపెద్దలతో కలిసి తన అత్తవారింటికి వచ్చింది. తలుపులు తీయకపోవడంతో ఇంటి వద్ద పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది. అనంతరం కోటబొమ్మాళి పోలీసులను ఆశ్రయించింది. ఎస్‌ఐ సత్యనారాయణ వివరాలు సేకరించారు. భర్తను పిలిపించి మాట్లాడతామని తెలిపారు.