
దళిత నాయకుల నిరసన
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని అరసవిల్లి మిల్లు కూడలిలో శనివారం బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు కలిసి ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి తమను సభా వేదికపైకి ఆహ్వానించలేదంటూ కొంతమంది దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యేలు దళిత నాయకులకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం దళిత నాయకులను సభావేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.వి.వి.ఎస్.ప్రసాదరావు, శ్రీకాకుళం తహసిల్దార్ గణపతి, మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతి, అరవల రవీంద్ర, దళిత నాయకులు తైక్వాండో శ్రీను, కల్లేపల్లి రాంగోపాల్, ఎస్వీ రమణ మాదిగ, బోసు మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.